ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (11:29 IST)

వసంత పంచమి : బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

basara temple
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వసంత పంచమి రోజున అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి నన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్ర నలుమూలల నుంచి తల్లిదండ్రులు వేల సంఖ్యలో బాసర అలయానికి తరలివచ్చారు. అదేసమయంలో ఆలయ అధికారులు కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 
 
అంతకుముందు ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి బాసర సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అక్షరాభ్యాసం కోసం అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేశారు. టికెట్ కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా చీరలను సిద్ధం చేశారు. మగ్గాలను బాసరకు తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలోనే చీరలను నేశారు. ఈ రోజు అమ్మవారిని ఈ చీరలతోనే అలంకరించారు. ఆలయాన్ని కూడా విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.