ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (10:43 IST)

ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ - కాపు సామాజికవర్గం నిర్ణయం!!

pawan kalyan
వచ్చే యేడాది ఏపీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, అధికార పార్టీ వైకాపాకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. అదేసమయంలో ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ సమాజికవర్గానికి చెందిన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను నిలబెట్టాలన్న తలంపులో కాపు సామాజికవర్గం నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వర్గానికి చెందిన సీనియర్ నేత హరిరామజోగయ్య సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. 
 
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే తమ మద్దతు టీడీపీకి ఇస్తామని ఆయన ప్రకటించారు. దీంతో ఆ వర్గానికి చెందిన నేతలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొందుకు తమ ఓట్లు మాత్రం కావాలి.. తమకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదా అనే ప్రశ్న మొదలైంది. పైగా, తమ వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి ఈ దఫా ముఖ్యమంత్రి కాకపోతే, భవిష్యత్‌లో అయ్యే అవకాశమే లేదన్న భావన కాపు సామాజిక వర్గ ప్రజల్లో బలంగా నాటుకునిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. 
 
ఇప్పటివరకు రెడ్డి సామాజికవర్గం జగన్మోహన్ రెడ్డికి, కమ్మ సామాజికవర్గం చంద్రబాబు నాయుడికి అండగా నిలబడటం వల్లే వారు ముఖ్యమంత్రులు అయ్యారని, ఇపుడు బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాపు సామాజికవర్గం పవన్‌కు అండగా నిలబడితే ఆయన ముఖ్యమంత్రి కావడం తథ్యమనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఏర్పాటును శాసించే ఉభయగోదావరి జిల్లాల ఓటర్లు ఈ దఫా పవన్‌కు అండగా నిలబడాలన్న సంకల్పంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
అదిసాధ్యంకానిపక్షంలో పవర్ షేరింగ్‌ను తెరపైకి తెచ్చారు. టీడీపీ - జనసేన పార్టీల కూటమి గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు, మరో రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా లేదా తొలి మూడేళ్లు చంద్రబాబు, ఆ తర్వాత రెండేళ్లు పనవ్ సీఎంగా ఉండేలా పవర్ షేరింగ్ ఉండాలన్న భావిస్తున్నారు. మొత్తంమీద ఈ దఫా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్.జి.రంగా వర్థంతి వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం కూడా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.