మహిళల్లో ఇరెగ్యులర్ పీరియెడ్స్... ఏం చేయాలి?
చాలామంది మహిళల్లో పీరియెడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత ఏర్పడి సమస్య తగ్గే అవకాశం వుంటుంది. ముఖ్యంగా గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లే కాకుండా, వీటిలో వుండే జింక్, సెలీనియం ఎలిమెంట్స్ వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది.
సమస్య వున్నవారు సీడ్ సైక్లింగ్ పాటించాలి. అంటే... ఓ సైకిల్‌లా గింజలు తీసుకోవడం అన్నమాట. గుమ్మడి గింజలు, అవిసె గింజలు మొదటి రోజు నుంచి 14 రోజుల వరకూ ఓ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. మొదటి రోజు అంటే పీరియడ్స్ ప్రారంభమైన రోజు. ఇక 15వ రోజు నుంచి 28వ రోజు వరకూ నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు ఓ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఒకేసారి కాకుండా 3 భాగాలు చేసి మూడు పూటలా తీసుకోవాలి. గింజలను పొడి చేసి మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఈ గింజలు తీసుకోవడంతో పాటు వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి.
ఇలా చేయడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి. జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. అధిక బరువు తగ్గుతారు. పీరియడ్స్ ముందు వచ్చే అనారోగ్యం తగ్గుతుంది. సంతానలేమి, మెనోపాజ్ లో వున్నవారు, గర్భసంచి తొలగించినవారు కూడా గింజలు తీసుకోవడం వల్ల ప్రయోజనం వుంటుంది.