ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 17 జులై 2021 (14:29 IST)

కన్నతల్లే కడతేర్చి, తానూ కాటికి చేరింది

విశాఖపట్నం,అరకులోయ: ఓ తల్లి తన ముగ్గురు పసి పిల్లలను కడతేర్చి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విధారకర ఘటన, శుక్రవారం మండల కేంద్రంలోని పాత పోస్టాపీసు కాలనీలో చోటు చేసుకుంది.
 
మండలంలోని శిమిలిగూడ గ్రామానికి చెందిన సంజీవ్(38) సురేఖ(34) భార్యాభర్తలు, వీరికి సుసన(10), సర్వీన్(8), సిరీల్(4) అనే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో గతకొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్నట్లు తెలుస్తుంది.
 
భార్యాభర్తల మధ్య వాగ్వాదం అధికమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేఖ తన భర్త ఇంట్లో లేని సమయంలో, తన ముగ్గురు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి కడతేర్చగా, అనంతరం తానూ కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మనసు కలిచివేసే ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి!
 
విషయం తెలుసుకున్న అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని, విగత జీవులుగా పడివున్న చిన్నారుల మృతదేహాలను చూసి, చలించి, కన్నీటి పర్యంతమయ్యారు. తదుపరి ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు..