సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (09:33 IST)

లండన్ పర్యటనలో ఉన్నపుడు చంద్రబాబును ఎత్తేసారు : సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు

ysjagan
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తాను లండన్ పర్యటనలో ఉండగా చంద్రబాబును ఎత్తేశారు (అరెస్టు చేశారు) అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత దాన్ని సరవరించుకునే ప్రయత్నం చేస్తూ, చంద్రబాబు బయట ఉన్నా.. లోపల ఉన్నా ఒక్కటేనని, చంద్రబాబు అరెస్టుకు తనకు ఎలాంటి సంబంధ లేదని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
విజయవాడ వేదికగా వైకాపా ప్రతినిధుల సభ సోమవారం జరిగింది. ఇందులో సీఎం జగన్‌ మాట్లాడుతూ, 'నేను లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు ఎత్తారు' అంటూ ఎగతాళిగా నవ్వుతూ చెబుతూనే.. వెంటనే దాన్ని సవరించుకునే ప్రయత్నమూ చేశారు. 
 
చంద్రబాబుపై నాకెలాంటి కక్షా లేదు. కక్ష సాధింపుతో ఆయన్ను అరెస్టు చేయలేదనీ, వాటినే జనంలోకి తీసుకువెళ్లండంటూ సభకు వచ్చిన వైకాపా నేతలను ఆదేశించారు.
 
'కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీ చంద్రబాబు మీద విచారణలు జరిపి, ఆయన అవినీతిని నిరూపించాయి. దోషులను ఈడీ అరెస్టు కూడా చేసింది' అని సీఎం ప్రకటించేశారు. 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి కన్సంట్‌ను ఉపసంహరించుకుంటే.. ఐటీ, ఈడీలను కూడా రాష్ట్రంలోకి రానివ్వకుండా అప్పట్లోనే చంద్రబాబు అనుమతిని ఉపసంహరించుకున్నారంటూ జగన్‌ అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. 
 
'చంద్రబాబుపై ప్రధాని మోడీ అవినీతి ఆరోపణలు చేశారని, కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆయన అవినీతిపై విచారణ జరిపాయని చెప్పడం ద్వారా.. చంద్రబాబు అరెస్టులో కేంద్రాన్ని భాగస్వామిని చేసి, ప్రజల నుంచి వస్తున్న ప్రతికూలత నుంచి తాను కొంతవరకైనా ఉపశమనం పొందాలనుకున్నట్లున్నారు' అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
 
ఇదిలావుంటే, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అరెస్టుపై మూడు వారాల్లోనే జగన్‌ ఇలా ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడటం వెనుక ఆంతర్యమేంటి? కలవరపాటా? ఆత్మరక్షణా? ఎన్నికల వేళ ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయమా? చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వచ్చిన ప్రతిస్పందన, తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్టుతో తనకు సంబంధం లేదని చెప్పేందుకు తాజాగా జగన్‌ ప్రయత్నించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.