గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (21:15 IST)

యుద్ధం సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

యుద్ధాలు సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం వంటివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. యుద్దాల ఫలితంగా సిద్దించే విజయాల వెనుక పలువురు సైనికుల బలిదానం ఉంటుందని, ఇది అయా కుటుంబాలకు అపారమైన కష్ట నష్టాలను అపాదిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. విజయవాడ రాజ్ భవన్‌లో రాష్ట్ర సైనిక్ సంక్షేమ విభాగం బుధవారం నిర్వహించిన ‘స్వర్ణిం విజయ్ వర్ష్’ కార్యక్రమానికి గౌరవ గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
 
1971 నాటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన నేపధ్యంలో ‘స్వర్ణిం విజయ్ వర్ష్’ పేరిట 50వ వార్షికోత్సవాన్ని జరుగుకుంటుండగా రాష్ట్ర వేడుకలకు రాజ్ భవన్ వేదిక అయ్యింది. గౌరవ గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు పౌరులు సైతం సామాజిక బాధ్యతగా భావించి మాజీ సైనికుల అవసరాలపై అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సైనిక సంక్షేమ సంస్ధ వీరి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంతమేర కృషి చేస్తాయన్న విశ్వాసం తనకుందన్నారు.
 
ఈ సందర్భంగా 1971 నాటి యుద్ధ వీరులు, కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ చరిత్రలో 1971 నాటి యుద్దం అతిచిన్న యుద్ధాలలో ఒకటి మాత్రమేనని, కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగిందని అయితే భారత సైన్యం పాకిస్తాన్ పై నిర్ణయాత్మక, చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. ఈ పరిణామాల ఫలితంగానే 'బంగ్లాదేశ్ ఏర్పాటు' సాధ్యమైందన్నారు.
 
యుద్ధ సమయంలో, భారత్, పాకిస్తాన్ సైనిక పటాలాలు ఏకకాలంలో తూర్పు, పశ్చిమ సరిహద్దులలో ఘర్షణ దిగాయని, పాకిస్తాన్ సైన్యం 1971 డిసెంబర్ 16న ఢాకాలో లొంగిపోతున్నట్టు ఒడంబడికపై సంతకం చేసిన తర్వాత యుద్ధం ముగిసిందన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన దాదాపు 93,000 మంది సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారని గవర్నర్ అన్నారు. ఈ విజయం ఇతర దేశాలలో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిందన్నారు. 2020 డిసెంబర్ 16న 'స్వర్ణిం విజయ్ వర్ష్'ను ప్రారంభించిన ప్రధాని విజయ జ్యోతిని ప్రజ్వలింపచేసారన్నారు.
 
జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ప్రారంభమైన విజయ జ్వాల దేశ వ్యాప్తంగా ప్రయాణిస్తూ విజయవాడ చేరుకోవటం ముదావహమన్నారు. తమ ప్రాణాలను త్యాగం చేసిన చెందిన సాయుధ దళాల సిబ్బందికి దేశం రుణపడి ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విజయ జ్వాల కార్యక్రమం ఇన్ చార్జి అధికారి విఎం రాజు నుండి గవర్నర్ విజయ జ్వాలను స్వీకరించారు.
 
ఈ సందర్భంగా గవర్నర్ 1971 నాటి యుద్ధ వితంతువులు, వికలాంగులకు శౌర్య అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా, ఆంతరంగిక శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రకాష్ కృష్ణాజిల్లా సంయిక్త పాలనాధికారి శివశంకర్, సైనిక సంక్షేమశాఖ సంచాలకులు వి.వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.