బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (08:56 IST)

వైజాగ్ విమానాశ్రయ ఘటన : ఇద్దరు ఖాకీలపై వేటుపడింది..

pawan kalyan
గత నెల 15వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్టణ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టులో వైకాపా మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేసినట్టు కేసులు నమోదయ్యాయి. అయితే, ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏసీపీ, సీఐ నిర్లక్ష్యంగా వ్యవహించినట్టు గుర్తించి, తాజాగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
వైకాపా ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరిగిన రోజే పవన్ కళ్యాణ్ కూడా విశాఖకు చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జనలో పాల్గొన్న మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డిలు విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జనసేన శ్రేణులు మంత్రులపై దాడికి యత్నించినట్టు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పలువురు జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు. 
 
అయితే, ఘర్షణ జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్న పశ్చిమ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్  ఏసీపీ టేకు మోహన రావు, సీఐ ఉమాకాంత్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఉన్నతాధికారుల విచారణలో తేల్చారు. దీంతో వారిద్దరినీ వీఆర్(వేకెన్సీ రిజర్వు)కు పంపించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.