మోడీ మానిటైజేషన్ తో కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి విద్యుత్ రంగం
కేంద్ర విద్యుత్ చట్ట సవరణలతో కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి విద్యుత్ రంగం వెళ్లిపోతోందని సీపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలు మోపడమే కాకుండా, విద్యుత్ ఉద్యోగుల భద్రతకు ముప్పు కలుగుతోందన్నారు. మోడీ మానిటైజేషన్ పాలసీతో ప్రభుత్వ ఆస్తులకు ఎసరు పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో పెంచిన విద్యుత్ భారాలు తగ్గించాలని, విజయవాడ విద్యుత్ సౌధ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేశారు. ఈ నెల 27న కేంద్ర విధానాలపై జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకాలని డిమాండు చేశారు. విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు, ప్రజలపై భారాల కు నిరసనగా ఆందోళన, కరపత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు , కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఎం నేతలు డి. కాశీనాథ్, బి.నాగేశ్వరరావు,హరినారాయణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.