ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (09:49 IST)

ఆలయంలో బూతు పురాణం పఠించిన మాజీ మంత్రి కొడాలి నాని

kodali nani
వైకాపా నేత, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోమారు తన నోటికి పని చెప్పారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని బూతు పదాలతో దూషించారు. దీంతో ఆలయంలో ఉన్న భక్తులు సైతం నివ్వెర పోయారు. ఈ ఘటన గుడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుడివాడ కాకర్ల వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రూ.30 లక్షలతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని కొడాలి నాని గురువారం ప్రారంభించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం, చంద్రబాబుపై విమర్శలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. 
 
ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కాలక్షేప మండప ప్రారంభోత్సవ వేదికను సైతం వైకాపా రంగులతో కూడిన బెలూన్లతో నింపేశారు. దేవాలయాన్ని రాజకీయాలకు వాడుకోవటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు, బూతులు దూషించేందుకు కొడాలి నానికి మరో స్థలం లభించలేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.