1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (21:24 IST)

రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సేవలు వినియోగించుకునే ఛాన్స్ : ఉండవల్లి

undavalli arun kumar
కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరం శంషాబాద్‌లో ఉన్న నోవాటెల్ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రాధాన్యం లేనిదే ఎన్టీఆర్‌తో అమిత్ షా అంత తీరికగా సమావేశమవుతారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా సమావేశం వెనుక ఖచ్చితంగా రాజకీయం అంశం ఉండి వుంటుందన్నారు. ఒక్క తెలంగాణాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిగివుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అన్ని అంశాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తుచేశారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ వంటి మరికొందరిని బీజేపీ తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాల్లో భాగంగానే ఈ తరహా సమావేశాలకు శ్రీకారం చుట్టివుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.