1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (08:30 IST)

అనంతపురానికి మిడతల ముప్పు?

అనంతపురం జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గం, గోరంట్ల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మిడతలు గుంపు కలకలం సృష్టించింది. రాయదుర్గం పట్టణం సమీపంలోని దాసప్పరొడ్డు పక్కనున్న జిల్లేడు చెట్టు ఆకులను మొత్తం తినేశాయి.

ఇదే రకంగా గోరంట్ల మండలంలోని చౌడేశ్వరీ కాలనీ సమీపంలోని జిల్లేడు చెట్టుపై పెద్దఎత్తున మిడతలు వాలి మొడుగా మిగిల్చాయి. మిడతల సమూహంపై స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మిడతలు ఇక్కడికి చేరుకున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే వ్యవసాయాధికారులు ఈ విషయాన్ని కొట్టేశారు.

ఉత్తరాది రాష్ట్రాలలో ఆశించిన మిడత రకానికి వీటికి ఎటువంటి సంబంధం లేదని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు హబీబ్‌ బాషా తెలిపారు. ఇవి స్థానికంగా ఉండే మిడతలేనని వీటి శాస్త్రీయ నామం 'పోయికిలోసెర్స్‌ పిక్టస్‌' అని తెలిపారు.

ఇవి జిల్లేడు మొక్కలపై మాత్రమే తన జీవిత కాలం పూర్తి చేసుకుంటుందని, వ్యవసాయ, ఉద్యాన పంటలను ఆశించదన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ మిడతలను పరిశీలించి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న మిడతలు కావని తేల్చి చెప్పారు.