బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 మే 2020 (21:16 IST)

డాక్టర్ సుధాకర్‌కు పెరుగుతున్న మద్దతు

డాక్టర్ సుధాకర్‌కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. రాజకీయ పార్టీలు, హక్కుల, దళిత సంఘాలు సుధాకర్‌కు అండగా నిలుస్తున్నారు. డాక్టర్‌పై పోలీసుల అనుచిత దాడిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

సుధాకర్‌కు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ కూడా మద్దతుగా నిలుస్తోంది. డాక్టర్‌ సుధాకర్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఖండించింది.

ఒక సంఘ విద్రోహిని బంధించినట్టు డాక్టర్‌ను నడిరోడ్డుపై బంధించి తీసుకెళ్లడం పోలీసులు చేసిన క్షమించరాని నేరంగా ఏపీజీడీఏ పరిగణిస్తుందని, కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్ చేస్తోంది.

డాక్టర్‌ సుధాకర్‌ను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేసమయంలో డాక్టర్‌ను కలుసుకునేందుకు ఆయన మాతృమూర్తికి కూడా అవకాశం ఇవ్వలేదంటూ వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.

ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అలాగే డాక్టర్‌ సుధాకర్‌ను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గడమాండ్ల చెన్నయ్య డిమాండ్‌ చేశారు. సుధాకర్‌ను ఎలాంటి విచారణ జరపకుండా ఏకపక్షంగా సస్పెండ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.