బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (12:13 IST)

ప్రేమపెళ్లి.. రెండో వార్షికోత్సవం రోజునే భార్యను హత్య చేసిన కసాయి భర్త... ఎక్కడ?

murder
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలోనే వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. అవి వారి మధ్య చిచ్చు రేపాయి. నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 29వ తేదీ (రెండో పెళ్లి రోజు)నే కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ దారుణం కాకినాడ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన బందుల నూకరాజు, దివ్య(26) ఎనిమిదేళ్ల క్రితం 2016, ఫిబ్రవరి 29న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప, బాబు సంతానం. నూకరాజు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి రెండుమూడు రోజులు ఉండి వస్తుంటాడు. కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఇరువురూ గొడవలు పడుతూ వచ్చేవారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి సర్ది చెప్పారు. గురువారం ఉదయం బయటకు వెళ్లి వచ్చిన నూకరాజు మళ్లీ భార్యతో ఉద్దేశ్యపూర్వకంగానే గొడవ పెట్టుకున్నాడు. వారి ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించినా.. రోజూ మాదిరిగానే సాధారణ గొడవే అనుకుని సమీపంలో ఉన్న బంధువులు, స్థానికులు పట్టించుకోలేదు. కొద్ది సేపటికి ఇంట్లో నుంచి దివ్య బయటకు రాగా.. అప్పటికే సిద్ధంగా ఉంచిన కత్తిని తీసుకుని వీధిలో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. 
 
మెడపై తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన మృతురాలి తోడికోడలు తల్లి లక్ష్మిపై సైతం కత్తితో దాడి చేయగా ఆమె చేతి వేలికి గాయాలయ్యాయి. అడ్డొస్తే నిన్నూ చంపేస్తానని బెదిరించడంతో ప్రాణభయంతో ఆమె పక్కకు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. భార్యను హత్య చేసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. కానీ, ఈ విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. 
 
ఢాకా రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం... 44 మంది మృత్యువాత 
 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఢాకాలోని ఏడు అంతస్తుల రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో కనీసం 44 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమయం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళం రంగంలోకి రెస్టారెంట్‌లో చిక్కున్న మరో 75 మంది ప్రాణాలతో రక్షించారు. ఈ అగ్నిప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే సంభవించినట్టు తెలుస్తుంది. 
 
ఢాకా బెయిలీ రోడ్డులోని ఓ బిర్యానీ రెస్టారంట్‌లో గురువారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగం అధికారి మహమ్మద్‌ షిహబ్‌ వెల్లడించారు. క్రమంగా పై అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్‌ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి.
 
'మేం ఆరో అంతస్తులో ఉన్నాం. మెట్ల మార్గంలో పొగ వస్తుండడం గమనించాం. అందరూ కింది నుంచి పైకి పరుగెత్తుకొచ్చారు. మేమంతా నీటి పైపుల ద్వారా కిందకు దిగాం. కొందరు పై నుంచి దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. కొంత మంది పూర్తిగా భవనం పైకి చేరుకున్నారు. సాయం కోసం అర్థించారు' అని రెస్టారంట్‌ మేనేజర్‌ సోహెల్‌ తెలిపారు.
 
బంగ్లాదేశ్‌లో అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీ కాంప్లెక్సుల్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2021 జులైలో ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో చెలగరేగిన మంటల్లో అనేక మంది పిల్లలు సహా 52 మంది దుర్మరణం చెందారు. 2019 ఫిబ్రవరిలో రాజధాని ఢాకాలో అపార్ట్‌మెంట్‌ బ్లాకుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 70 మంది మృతి చెందారు.