గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:15 IST)

అల్లూరి సీతారామరాజు పేరిట కొత్త జిల్లా.. : మంత్రి అవంతి శ్రీనివాస్

కేంద్ర ప్రభుత్వ కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తెరిచి... వాటిలోకి సందర్శకులను, పర్యాటకులకు అనుమతిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్యంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రాష్ట్రంలో 5, 7 స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, శిల్పారామం, సాంస్కృతిక విభాగాలపై ఆయా శాఖాధిరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలననుసరించి గత మార్చి నెల నుంచి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మూసివేశామన్నారు. నెలకు రూ.10 కోట్ల చొప్పున్న నేటి వరకూ రూ.60 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.

లాక్ డౌన్ నిబంధలకనుగుణంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణాలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులకు అనుమతులు ఇచ్చారన్నారు. నాలుగు నెలల నుంచి పర్యాటక ప్రాంతాలు మూతపడి ఉన్నాయని, మరో 15 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో మరమ్మత్తులు ఉంటే వాటిని పూర్తి చేసి, ఆగస్టు ఒకటో తేదీ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. 

7 చోట్ల 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటు...
రాష్ట్రంలో ఏడు పర్యాటక ప్రాంతాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఈ హోటళ్లు ఏర్పాటుకు ప్రణాళిలు సిద్ధం చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం మరో వారం రోజుల్లో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలో ప్రముఖుల జయంతులు, వర్థంతులను నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. 

అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటు....
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ జిల్లాలో ఏర్పడే కొత్ల జిల్లాకు స్వాతంత్ర్య సమర యోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. 

3 రాజధానులతో వేర్పాటు వాదానికి అడ్డుకట్ట....
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల  అభివృద్ధే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లోనే అభివృద్ధి కేంద్రీకృతమవ్వడంలో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు.

రాష్ట్రంలో మరోసారి వేర్పాటు వాద ఉద్యమానికి తావులేకుండా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా న్యాయ, శాసన, కార్యనిర్వాహాక రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ఏ ప్రాంతానికో, ఏ వర్గానికో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదన్నారు.

ఏడాది కాలంలోనే మూడున్నర కోట్ల మంది ప్రజలకు లబ్ధి కలిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. కృష్ణా, గుంటూరు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు శభాష్ అనేలా సీఎం జగన్ పాలన అందిస్తున్నారన్నారు.

పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే...
కార్మికులతో పాటు చుట్టు పక్కల ఉండే ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేలా రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమని, అదే సమయంలో ప్రజల ప్రాణాలకు అధిక ప్రాధాన్యతిస్తామని ఆయన తెలిపారు.

విశాఖపట్నంలోని పరవాడలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారని, గాయపడిన ముగ్గురికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించామని తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రంలోని ఉన్న పరిశ్రమ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నామన్నారు. 

అంతకుముందు నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్, శిల్పా రామం సీఈవో బీజే జయరామ్, పర్యాటక శాఖ సీఈవో ప్రవీణ్ కుమార్, ఆర్.డి. మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.