1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (13:55 IST)

ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి.. సంక్రాంతికి స్పెషల్ గిఫ్ట్

sankranti
ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయితే అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు. కొత్త పథకాలపై కూడా దృష్టి సారించారు. (సింబాలిక్ చిత్రం)
 
ప్రజలను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ కొత్త పథకాలు తీసుకురానున్నారు. తెలంగాణ, కర్ణాటక తరహాలో ఏపీలో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
 
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అయింది. చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకుంటే... మహిళల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
 
ఏపీలో అన్ని రకాల పాస్‌లు కలిగిన వారు 10 లక్షల మంది ఉన్నారు. ఇందులో 3-4 లక్షల మంది విద్యార్థులు, మహిళలు ఉన్నారు. వాటి ద్వారా ఆర్టీసీకి నిత్యం సగటున రూ.17 కోట్ల ఆదాయం సమకూరుతోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే రోజుకు రూ.6 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా.
 
మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీపై ప్రతి నెలా కనీసం 200 కోట్ల భారం పడుతుందని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లించేలా సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. 
 
బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో పాటు పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం, లగ్జరీ బస్సుల్లో రాయితీలు కల్పించడంపై కూడా చర్చించారు.