నాణ్యమైన చదువుతో పేదరికం మాయం : సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 'జగనన్న విద్యాకానుక' కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ, పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని ఏపీ సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న సుమారు 47 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు శుభదినమని చెప్పారు. రూ.931 కోట్లతో విద్యాకానుక కిట్లు అందజేస్తున్నట్లు జగన్ వివరించారు. విద్యార్థుల కోసం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుని యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చామని చెప్పారు. 8వ తరగతి పిల్లలకు రూ.12వేల విలువైన ట్యాబ్ ఇస్తున్నామని.. బైజూస్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.