మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (14:14 IST)

తులసి ఆకుల రసంలో ఒక చెమ్చా తేనె కలిపి చప్పరిస్తే...?

క్యారెట్ రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్ళల్లో కలిపి భోజనానికి ముందు ఒక కప్పు తాగితే ముక్కు సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందవచ్చును. కొబ్బరి నూనె, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బచ్చలి రసం, అనాసరసం, సమపాళ్ళల్లో తీసుకుని కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
 
తేనెటీగ, కందిరీగ కుట్టినప్పుడు ఉల్లిపాయరసం రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి. అరికాళ్ళు విపరీతంగా మంటపుడుతుంటే.. గోరింటాకు గానీ, నెయ్యి గానీ, సొరకాయ గుజ్జుగానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకుల రసంలో ఒక చెమ్చా తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతునొప్పి, దగ్గు వెంటనే తగ్గుతాయి. పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరిస్తే కొంత పంటినొప్పి తగ్గుతుంది.
 
ఏదైనా వేడి ద్రవం శరీరం మీదపడి కాలితే, కాలిన చోట వెంటనే ఐస్ ముక్కను ఉంచాలి. ఓ నిమిషం తరువాత పాలు, తేనె సమపాళ్ళల్లో కలిపి ఈ మిశ్రమాన్ని కాలిన చోటు రాస్తే చర్మం బొబ్బలెక్కదు. మరుగుతున్న నీళ్ళల్లో యూకలిప్టస్ ఆకులు కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. రాత్రిళ్ళు నిద్రపట్టక అవస్థ పడేవారు, పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి వేడిపాలలో కాస్త తేనె, మరికాస్త పంచదార కలుపుకుని తాగితే హయిగా నిద్రపడుతుంది.