సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (16:24 IST)

రైతు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది

కేరళ రైతు కుటుంబం
''ఇంకా నాకు డబ్బులు రాలేదు. ఎప్పుడు వస్తాయో బ్యాంకువాళ్లేమీ చెప్పలేదు'' అని కొంచెం కలవరపడుతూ చెప్పారు పెరున్నన్ రాజన్. రాజన్ వయసు 58 ఏళ్లు. ఆయనది కేరళలోని కన్నూరు. రైతు కూలీగా పనిచేస్తుంటారు. ఇప్పుడు ఆయన ఎదురుచూపులంతా బ్యాంకులో డబ్బులు ఎప్పుడు పడతాయో అనే!

 
మరి, అది చిన్న మొత్తమేమీ కాదు. ఏకంగా రూ.7.2 కోట్లు. కేరళ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లో ఆయన టికెట్ కొన్నారు. క్రిస్మస్ లాటరీలో ఆయన కొన్న టికెట్‌కు రూ.12 కోట్ల బంపర్ ప్రైజ్ తగిలింది. పన్నులవీ పోగా రూ.7.2 కోట్లు రాజన్‌ అందుకోబోతున్నారు. ఒక్కసారిగా ఇంత మొత్తం రావడంతో రాజన్ పట్టరాని సంతోషంతో కనిపిస్తున్నారు.

 
''ఒక బ్యాంకులో రూ.5 లక్షల అప్పుంది. ఇంకో బ్యాంకులో కూడా అప్పు తీసుకున్నా. చాలా అప్పులు చేశా. ముందుగా అవన్నీ తీర్చేయాలి'' అని ఆయన బీబీసీతో చెప్పారు. గెలిచిన డబ్బును ఏం చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు... ''ఇంకా, నేనేమీ ఆలోచించలేదు. ముందు అప్పు తీర్చాలి. డబ్బుతో ఏం చేయాలన్నది తర్వాత ఆలోచిస్తా'' అని బదులిచ్చారు.

 
మాలూర్‌లోని థోలాంబరా ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రాజన్ కూలీ పని చేస్తుంటారు. ఇది గిరిజన ప్రాంతం. లాటరీ గెలుచుకున్న విషయం తనకు తెలియగానే చాలా ఆందనపడ్డానంటూ, ఆ క్షణాలను రాజన్ బీబీసీతో గుర్తుచేసుకున్నారు. ''లాటరీ తగలిందని తెలియగానే, మా కుటుంబం అంతా చాలా సంతోషపడ్డాం. నిజంగానే మాకు లాటరీ వచ్చిందా, లేదా అని నిర్దారించుకునేందుకు బ్యాంకుకు వెళ్లాం'' అని అన్నారు.

 
రాజన్‌ భార్య రజనీ, కూతురు అక్షర, కొడుకు రిజిల్ కూడా ఆయన వెంట బ్యాంకుకు వెళ్లారు. స్థానిక సహకార బ్యాంకులో రాజన్‌కు ఖాతా ఉంది. ఆయన తన లాటరీ టికెట్‌ను ఆ బ్యాంకులోనే జమ చేశారు. అక్కడి నుంచి కున్నార్ జిల్లా బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లాలని అక్కడి అధికారులు రాజన్‌కు చెప్పారు. అక్కడికి వెళ్తున్న సమయంలోనే ఆయన బీబీసీతో మాట్లాడారు.

 
రోజూ ఐదు టికెట్లు కొనేవారు
థోలాంబరా సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు సెక్రటరీ దామోదరన్ కూడా బీబీసీతో మాట్లాడారు. ''మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరీ గందరగోళంగా ఏమీ లేరు. కొంచెం టెన్షన్‌ పడుతున్నట్లైతే అనిపించారు. ఆయన మాకు బాగా తెలుసు. బ్యాంకుకు అప్పుడుప్పుడు వస్తూపోతూ ఉంటారు. రూ.50 వేల వ్యవసాయ రుణం, మరో రూ.25వేల అప్పు కూడా ఆయన మా బ్యాంకు నుంచి తీసుకున్నారు. అందుకోసం డబ్బులు జమ చేయడానికి వస్తూ ఉంటారు. అప్పులో అసలు ఆయన ఇంకా బాకీ ఉన్నారు'' అని దామోదరన్ చెప్పారు.

 
పెద్ద మొత్తం గెలవాలన్న ఆశతో రోజూ తాను ఐదు లాటరీ టాకెట్లు కొనేవాడినని రాజన్ చెప్పారు. ఇదివరకు ఆయన మూడు సార్లు మాత్రమే రూ.500 చొప్పున ప్రైజ్ గెలిచారు. అయినా, తన ఆదాయంలో పెద్ద భాగాన్ని లాటరీలపై ఆయన వెచ్చిస్తూ వచ్చారు. కేరళలో వ్యవసాయ కూలీలకు రూ.800 దాకా కూలీ డబ్బు వస్తుంది.

 
రాజన్ భార్య రజనీ ఇరుగుపొరుగు ఇళ్లలో పనిచేస్తుంటారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పిల్లల్లో ఇద్దరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పెద్ద కూతురికి పెళ్లి అయ్యింది. ఆమె వేర దగ్గర నివాసం ఉంటున్నారు. కొడుకు రిజిల్ కూడా రాజన్‌తోపాటు రైతు కూలీగా పనిచేస్తున్నారు. చిన్న కూతురు అక్షర హైస్కూల్‌లో చదువుకుంటోంది.