శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 19 జులై 2024 (14:23 IST)

మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు సహా అనేక రంగాలపై ప్రభావం

indigo
ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రధాన బ్యాంకులు, మీడియా సంస్థలు, విమానయాన సంస్థలకు ఐటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు నిలిచిపోయాయి. యునైటైడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు కూడా తిరగడం లేదు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సేవలకూ అంతరాయమేర్పడింది. బెర్లిన్ విమానాశ్రయంలోనూ విమానాల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి.
 
యూకేలో స్కై న్యూస్ చానల్ ప్రసారాలు ఆగిపోయాయి. ఆస్ట్రేలియాకు చెందిన టెలికమ్యూనికేషన్స్ సంస్థ టెల్‌స్ట్రా కూడా ఈ ప్రభావానికి లోనయినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కలిగిన ఈ అంతరాయం ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో అనేక మంది తమ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై బ్లూస్క్రీన్ మాత్రమే కనిపిస్తోందంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులు, ఇతర అనేక సంస్థల్లో కార్యకలాపాలపై ప్రభావం పడింది. కాగా భారత్‌లోనూ కొన్ని సంస్థలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించాయి.
 
ముఖ్యంగా విమానయాన సంస్థలు దీనిపై స్పందించాయి. స్పైస్ జెట్ ఇప్పటికే ఎక్స్ వేదికగా దీనిపై ప్రకటన చేసింది. బుకింగ్స్, చెక్ఇన్‌లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నామని..అందుకే మాన్యువల్ చెక్ ఇన్‌కి తాత్కాలికంగా మారామని పోస్ట్ చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల తమ కంప్యూటర్లపై ప్రభావం పడిందని, బుకింగ్, చెక్ ఇన్‌‌లలో సమస్యలు ఏర్పడడంతో పాటు ఇతర విమాన సేవలపైనా ప్రభావం పడుతోందని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ప్రయాణికుల సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని.. ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచించింది.
 
అంతర్జాతీయంగా ఏర్పడిన ఐటీ అవుటేజ్ కారణంగా సమస్యలు ఎదురవుతున్నట్లు పేర్కొంది. మరోవైపు దిల్లీ విమానాశ్రయం కూడా సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది.