సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శనివారం, 10 ఆగస్టు 2019 (21:06 IST)

ఆర్టికల్ 370 సవరణతో కశ్మీర్‌పై సాధించిన పురోగతిని 30 ఏళ్లు వెనక్కి... ఎలా?

జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370కి సవరణ తెచ్చిన తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా సైనిక దిగ్బంధంలో ఉంది. టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. అక్కడ ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి సరిగ్గా తెలియడం లేదు. అయితే, ఆర్టికల్ 370కి సవరణ తేవడంపై దిల్లీ సహా కొన్నిచోట్ల కశ్మీరీ పండిట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.

 
ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశంపై సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న హక్కుల కార్యకర్త, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సంజయ్ కాక్‌తో బీబీసీ ప్రతినిధి పవన్‌కాంత్ దిగవల్లి మాట్లాడారు. ఆర్టికల్ 370 సవరణ నిర్ణయంపై ఆయన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సంజయ్ స్వయంగా కశ్మీరీ పండిట్ కూడా.

 
మళ్లీ 30 ఏళ్లు వెనక్కి నెట్టారు
భారత్‌, కశ్మీర్‌ల బంధంలో గత 30 ఏళ్లలో సాధించిన పురోగతి ఆర్టికల్ 370 సవరణ వల్ల వెనక్కు పోయినట్లైందని సంజయ్ కాక్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల వేర్పాటువాదులపై ఎలాంటి ప్రభావమూ ఉండదని, కశ్మీర్‌లో భారత్‌కు అనుకూలంగా ఉండే వర్గమే పూర్తిగా దెబ్బతిందని ఆయన అన్నారు.

 
రాజకీయ పార్టీలు, కొన్ని సంఘాలు కశ్మీరీలకు భారత్‌కు మధ్య వారధిలా పనిచేస్తున్నాయని, 30 ఏళ్ల కృషితో నిర్మాణమైన ఆ వారధి పునాదులు ఈ నిర్ణయంతో పూర్తిగా కదిలిపోయాయని సంజయ్ అభిప్రాయపడ్డారు. ''భారత్‌కు విధేయంగా ఉండటం, అలా ఉంటున్నందుకు ప్రతిఫలంగా రాష్ట్రానికి దక్కిన ప్రత్యేక అధికారాలు ఎక్కడికీ పోవన్న భరోసాను కశ్మీరీ ప్రజలకు కల్పించడంపైనే ఆధారపడి ఆ పార్టీలు, సంఘాలు ఉనికిలో ఉన్నాయి. 

 
భారత్‌కు అనుకూలంగా ఉన్న ఈ ఒకే ఒక్క వర్గాన్ని ఇప్పుడు ఈ నిర్ణయంతో పూర్తిగా దెబ్బకొట్టారు. ఎంత నష్టం జరిగిందో మనం కళ్లారా చూస్తున్నాం. ప్రధానంగా కశ్మీర్‌లో అరెస్టైనవారిని చూస్తే.. పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వంటివారే కనిపిస్తున్నారు'' అని సంజయ్ వ్యాఖ్యానించారు.

 
''భారత ప్రభుత్వం, సైన్యం, నిఘా సంస్థలు 30 ఏళ్లుగా శ్రమిస్తూ భారత్‌కు అనుకూలంగా ఈ మధ్యస్థ వర్గాన్ని తయారుచేసుకున్నాయి. ఆ వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తూ కనీసం సంప్రదింపులు, సూచనలైనా చేయకుండా ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ను భారతదేశంతో మమేకమయ్యేలా చేయడానికి బదులు, ఆ బంధాన్ని మళ్లీ ముప్పై ఏళ్లు వెనక్కు నెట్టేశారు'' అని అన్నారు.

 
మొత్తం దేశానికీ హెచ్చరిక
మొత్తం భారత దేశానికి, కశ్మీర్‌లాగే ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్న ఇతర రాష్ట్రాలకూ కేంద్రం తాజా చర్య ఓ పెద్ద హెచ్చరిక అని సంజయ్ అభిప్రాయపడ్డారు. 370 లాంటి ఇతర ఆర్టికల్స్ ద్వారా రక్షణ పొందుతున్న మిజోరాం, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల ప్రజలకూ కశ్మీరీలకు జరిగినట్లే జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

 
ఆర్టికల్ 370లోని ప్రత్యేక అధికారాలు కశ్మీరీ ముస్లింలకు మాత్రమే వర్తించేవి కాదని.. జమ్మూ, లద్దాఖ్ వంటి ఇతర ప్రాంతాలవారి హక్కులను అవి పరిరక్షించేవని సంజయ్ అన్నారు. సైన్యం కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పటికీ లద్దాఖ్‌లో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందిందని, పెట్టుబడుల వరద మొదలైతే అక్కడుండేవారి పరిస్థితి ఏమవుతోందనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 
''ఉదాహరణకు భారత్ నుంచి లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతంలోకి పెట్టుబడులు వరద మొదలైందని అనుకుందాం. అక్కడ చిన్న చిన్న హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్ హౌజ్‌లను పెట్టుకుని బతుకుతున్నవారి పరిస్థితి ఏంటి? కార్గిల్ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని, ఇప్పటికే అక్కడ సెక్షన్ 144 విధించారు. ప్రత్యేకాధికారాలు తొలగించడం వల్ల తమకు కూడా నష్టమేనని జమ్మూలోని బీజేపీ ఎమ్మేల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతున్న వీడియోలు కూడా నేను చూశా. జమ్మూ నగరంలో కొంత మేర పారిశ్రామికీకరణ జరిగింది. బయటివారు రావడం వల్ల ఇక్కడి భూముల ధరలు పెరిగితే, స్థానిక పారిశ్రామికవేత్తలు ఏమైపోతారు?'' అని సంజయ్ ప్రశ్నించారు.

 
ముందున్న అడ్డంకి
ఆర్టికల్ 370 సవరణ కేంద్రం విస్తృతంగా సంప్రదింపులు జరిపి తీసుకున్న నిర్ణయమని తాను భావించట్లేదని ఆయన అన్నారు. కశ్మీర్‌కు తాము తిరిగి వెళ్లొచ్చు అంటూ ఆర్టికల్ 370 సవరణ గురించి కశ్మీరీ పండిట్లు సంబరాలు చేసుకుంటున్నట్లున్న వీడియోల విషయంపై మాట్లాడుతూ.. అంతకుముందు వారిని కశ్మీర్‌కు వెళ్లకుండా ఆపిందేంటో తాను అర్థం చేసుకోలేకపోతున్నానని సంజయ్ వ్యాఖ్యానించారు.