రాష్ట్ర విద్యార్థులు సివిల్స్‌లో సత్తా చాటాలి... సివిల్స్ స్టడీ మెటీరియల్ రెడీ
విజయవాడ: ఇతర పోటీ పరీక్షలలో విజయం సాధిస్తున్న తీరుగానే సివిల్స్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ విధ్యార్ధులు జాతీయ స్ధాయిలో తమ ప్రతిభను చాటాలని ఎపిటిడిసి ఎండి, ఎపిటిఎ సిఇఓ హిమాన్హు శుక్లా అభిప్రాయపడ్డారు. పోటీ పరీక్షల శిక్షణలో మెటీరియల్ కీలక పాత్రను పోషిస్తుందని, ప్రత్యేకించి కరెంట్ ఎఫైర్స్ విషయంలో అభ్యర్ధులు నిరంతర సాధన చేయవలసి ఉంటుందన్నారు.
విజయవాడ కేంద్రంగా సివిల్స్, గ్రూప్-1 శిక్షణను అందిస్తున్న తక్షశిల ఐఎఎస్ అకాడమీ సివిల్స్, గ్రూప్-1 శిక్షణార్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను శుక్లా ఆవిష్కరించారు. నగరంలోని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో తక్షశిల ఐఎఎస్ అకాడమీ ఎం.డి, ఛీప్ ప్యాకల్టీ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హిమాన్హు శుక్లా మాట్లాడుతూ అమరావతి కేంద్రంగా సివిల్స్ పరీక్షల శిక్షణ కొనసాగవలసి ఉందన్నారు. ఢిల్లీ వంటి దూరప్రాంతాలలో శిక్షణ తీసుకోవటం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కాగా, కొంతవరకు తక్షశిల ఐఎఎస్ అకాడమీ ఆ లోటును భర్తీ చేయటం ముదావహమన్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐఐటి, ఐఐఎం వంటి సంస్థలలో గణనీయంగా సీట్లు దక్కించుకోగలుగుతున్నారని, అదే తీరుగా యుపిపిఎస్‌సి పరీక్షలలో కూడా సత్తా చాటాలన్నారు. జాతీయ స్థాయి సంస్థలతో పాటు సివిల్స్ శిక్షణకు నిర్దేశించిన ఎన్‌టిఆర్ విద్యోన్నతి పథకానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యాసంస్థగా తక్షశిల గుర్తింపు పొందటం ముదావహమన్నారు.
ఈ సందర్భంగా తక్షశిల ఐఎఎస్ అకాడమీ అధినేత దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ స్ధాపించిన నాలుగు సంవత్సరాలలోనే ఏడు ర్యాంకులు సాధించగలిగామని, నిపుణులైన ఫ్యాకల్టీతో బోధన అందించగలగటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుతం తయారుచేసిన మెటీరియల్ సైతం నిపుణుల పర్యవేక్షణలో చేయగలిగామని, పలువురు సీనియర్ సివిల్స్ బోధకులు ఇందులో భాగస్వాములు అయ్యారని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయిలు, తక్షశిల సీనియర్ ఫ్యాకల్టీ పిల్లి శ్రీనివాస్, హరిశ్చంద్ర ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.