నేడు తెలంగాణ ఎంసెట్ తుదిదశ కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా శనివారం తుది విడత కౌన్సెలింగ్ జరుగనుంది. దీనికి సంబంధించి శని, ఆదివారాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇంజినీరింగ్ తుదివిడుత కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే అంశంపై ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు స్లాట్ కూడా స్వయంగా వారే బుకింగ్ చేసుకోవాలిస ఉంటుందన్నారు. స్లాట్ బుకింగ్ అనంతరం ఈ నెల 8న అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలిస్తామని వెల్లడించారు.
ధ్రవపత్రాల పరిశీలన అనంతరం ఈనెల 9 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని.. 12న తుది విడత సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈనెల 12-15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వెంటనే అడ్మిషన్ పొందిన కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుందన్నారు. సీటు రద్దు చేసుకోవడానికి ఈ నెల 18 వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
తుదివిడత కౌన్సెలింగ్ అనంతరం.. ఈనెల 20 నుంచి స్పెషల్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. దీని కోసం.. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలని.. దీనికి సంబంధించి 24న సీట్లు కేటాయిస్తామన్నారు. దీనికి హాజరయ్యే అభ్యర్థులు 24 నుంచి 26 వరకు వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. 24 నుంచి 26 వరకు అడ్మిషన్ పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వివరించారు.