శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 మే 2018 (15:52 IST)

సివిల్స్ విజేతల మార్కుల వెల్లడి.. 55.6 శాతం మార్కులతో తెలంగాణ బిడ్డ టాపర్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన 2017 సివిల్స్ విజేతల మార్కులను వెల్లడించింది. ఇందులో దురుశెట్టి అనుదీప్‌ 55.6 శాతం మార్కులు సాధించాడు. 28 యేళ్ళ అనుదీప్ ఇండియన్ రెవెన్సూ సర్వీస్‌

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన 2017 సివిల్స్ విజేతల మార్కులను వెల్లడించింది. ఇందులో దురుశెట్టి అనుదీప్‌ 55.6 శాతం మార్కులు సాధించాడు. 28 యేళ్ళ అనుదీప్ ఇండియన్ రెవెన్సూ సర్వీస్‌లో అధికారిగా పని చేస్తున్నారు. అనుదీప్ తెలంగాణా ప్రాంతవాసికావడం గమనార్హం. ఈయనకు ప్రధాన పరీక్షలో 950, మౌఖిక పరీక్షలో 176 మార్కులను సాధించారు. దీంతో మొత్తంగా 2025కుగాను ఆయన 1,126 మార్కులు తెచ్చుకున్నారు.
 
ఇకపోతే, రెండో ర్యాంకు సాధించిన అను కుమారికి 1,124 (55.50 శాతం - ప్రధాన పరీక్షలో 937, మౌఖిక పరీక్షలో 187) మార్కులు వచ్చాయి. మూడో ర్యాంకు సంపాదించిన సచిన్‌ గుప్తా 1122 (55.40 శాతం - ప్రధాన పరీక్షలో 946, మౌఖిక పరీక్షలో 176) మార్కులు తెచ్చుకున్నారు. 
 
ఈ యేడాది పరీక్ష ఫలితాలను గతవారం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. 240 మంది మహిళలు సహా మొత్తంగా 990 మందిని ఎంపికచేస్తూ తుది జాబితా విడుదలచేసింది. తాజాగా వారి మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచింది. దీనిలో చివరి ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్‌కు 830 (40.98 శాతం - ప్రధాన పరీక్షలో 687, మౌఖిక పరీక్షలో 143) మార్కులు వచ్చాయి.
 
కాగా, 2017 సివిల్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష గతయేడాది జూన్ 18వ తేదీన నిర్వహించగా, ఈ పరీక్షకు మొత్తం 9,57,590 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 4,56,625 మంది పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఆ తర్వాత 13,366 మంది అభ్యర్థు ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించి 2017 అక్టోబరు - నవంబరు నెలలో జరిగిన మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారు. 
 
వీరిలో 2568 మందికి ఇంటర్వ్యూ, మౌఖిక పరీక్షలను ఈ యేడాది ఫిబ్రవరి - ఏప్రిల్ నెలలో నిర్వహించగా, వీరిలో 990 మంది ఎంపికయ్యారు. అయితే, గత 2016లో వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో నందని కేఆర్ అనే అభ్యర్థి మొత్తం 55.3 శాతం మార్కులు (ప్రధాన పరీక్షలో 927, మౌఖిక పరీక్షలో 193 కలుపుకుని మొత్తం 1120) సాధించి టాపర్‌గా నిలిచాడు.