1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (08:13 IST)

ప్రజల్లో కరోనా భయం.... మాస్కుల ధరలకు రెక్కలు

హైదరాబాద్ నగర ప్రజలకు కరోనా వైరస్ భయంపట్టుకుంది. దుబాయ్ వెళ్లి వచ్చిన ఓ టెక్కీకి కరోనా వైరస్ ఉందని తేలింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదేసమంయలో కరోనా వైరస్ వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 
 
అదేసమయంలో హైదరాబాద్‌లో ఇప్పుడు మాస్కుల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ కావడం, అధికారులు అప్రమత్తం కావడంతో మాస్కులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వైరస్ సోకకుండా మాస్కులు ధరించాలన్న అధికారుల సూచనతో ప్రతి ఒక్కరు మాస్కులకు ఎగబడుతున్నారు. 
 
ఇదే అదునుగా భావించిన మందుల దాకాణదారులు వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌లో రూ.1.60 విలువ చేసే రెండు లేయర్ల మాస్కు ధర ఇప్పుడు రూ.20-25 వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తుండగా, రూ.30-40 విలువ చేసే ఎన్95 మాస్క్‌ను రూ.300 వరకు విక్రయిస్తున్నారు. 
 
మాస్కులకు ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద వీటికి మరింత డిమాండ్ ఉంది.
 
ఇక, అత్యంత చవగ్గా ఔషధాలు లభించే జనరిక్ మందుల షాపుల్లోనూ మాస్కుల ధర అమాంతం పెరిగిపోయింది. ఒక్కో మాస్కును రూ.15-20 మధ్య విక్రయిస్తున్నారు. గతంలో వంద మాస్కుల ప్యాకెట్ రూ.160 ఉంటే ఇప్పడది ఏకంగా రూ.1600కు పెరిగడం గమనార్హం.