శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (09:09 IST)

దేశంలో లక్షకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ మరోమారు విశ్వరూపం ప్రదర్శించింది. రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయిలో సాగుతోంది. ఫలితంగా కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 93 వేలుగా నమోదయ్యాయి. 
 
కొత్త కరోనా కేసులు వచ్చిన తర్వాత, తిరిగి ఐదు మాసాల తర్వాత ఆ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శనివారం నాడు ఏకంగా 93,077 కేసులు వచ్చాయి. ఇదేసమయంలో నాలుగు నెలల తార్వాత మరణాల సంఖ్య 500ను తాకింది. 
 
మరో వారం, పది రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును దాటేస్తుందని, అన్ని రాష్ట్రాలూ జాగ్రాత్తగా ఉండి, కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
 
కాగా శుక్రవారం నాడు ఇండియాలో 89 వేల రోజువారీ కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో శుక్రవారం మిగతా అన్ని దేశాల కన్నా, భారత్‌లోనే అధిక సంఖ్యలో నమోదు కావడం గమనార్హం. యూఎస్‌లో 70,024, బ్రెజిల్ లో 69,692 కేసులు రాగా, వాటికి మించిన కేసులు ఇండియాలో నమోదయ్యాయి.
 
కాగా, కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో శనివారం నాడు 49,447 కేసులు రావడం గమనార్హం. మహారాష్ట్రతో పాటు హర్యానా, బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి