బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (16:20 IST)

ఓటమికి కూడా సెలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి : బీసీసీఐ

ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ నుంచి టీమిండియా నిష్క్రమించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జట్టు ఎపుడు ఓటమిపాలైనా ఆటగాళ్లనే బాధ్యుల్ని చేస్తున్నారని, సిరీస్ విజయాలు, టోర్నమెంట్ టైటిళ్లు సాధించినప్పుడు నజరానాలు అందుకునే సెలక్టర్లు, జట్టు ఓడినప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 
 
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఎప్పుడూ జట్టు వెంటే ఉంటాడని, కానీ నాలుగో నంబర్ ఆటగాడిగా ఎవర్ని తీసుకోవాలన్నదానిపై అవగాహన లేకుండా పోయిందని ఓ బీసీసీఐ అధికారి విమర్శించారు. వరల్డ్ కప్ కోసం ప్రాబబుల్స్ ఎంపిక నుంచి నిన్నమొన్నటి మార్పులు చేర్పుల వరకు అన్ని నిర్ణయాలు సెలక్షన్ కమిటీనే తీసుకుందన్నారు. 
 
జట్టు అవసరాలకు అనుగుణంగాకాకుండా, అవగాహనాలోపంతో తీసుకున్న ఆ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమయ్యాయని, ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి సెలక్షన్ కమిటీ సభ్యులే బాధ్యత తీసుకోవాలని ఆ అధికారి స్పష్టంచేశారు. ప్రపంచకప్ వంటి అత్యున్నత ఈవెంట్‌కు నాలుగో నంబర్ ఆటగాడిని ఎంపిక చేయలేకపోయారంటే అది సెలక్టర్ల అసమర్థతేనని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.