మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (08:52 IST)

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు... స్వదేశానికి సాఫారీలు

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసింది. భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సివుంది. ఈ సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే ధర్మాశాలలో జరగాల్సివుంది. కానీ, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో లక్నో, కోల్‌కతాలలో జరగాల్సిన రెండు, మూడు వన్డేలను కూడా రద్దు చేసింది. 
 
నిజానికి ఈ రెండు వన్డే మ్యాచ్‌లను ఒకే వేదికలో అంటే లక్నోలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించాలని భావించారు. కానీ, దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పైగా, ఈ వైరస్ బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో ఈ రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫలితంగా సఫారీ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లిపోయారు. 
 
కాగా, ఇప్పటికే ఈ నెల 29వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 వేడుకలను కూడా వచ్చే నెలకు వాయిదా వేశారు. అప్పటికీ దేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాకుంటే ఈ టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐతో పాటు.. ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. కాగా, కరోనా దెబ్బకు అనేక క్రిడా పోటీల నిర్వహణను వాయిదావేస్తున్న విషయం తెల్సిందే.