#RRR పోస్టర్ రిలీజ్.. డేవిడ్ వార్నర్ ఫోటో వైరల్.. హెల్మెట్ గాయ్స్ అంటూ ట్రోల్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగులతో స్పూఫ్ వీడియోలో వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూ వుంటాడు.
తాజాగా జక్కన్న రాజమౌళిపై పడ్డాడు. సరికొత్త ఫోటోనూ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ 'ఆర్ఆర్ఆర్' మూవీ పోస్ట్‌ర్‌ను మార్ఫ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ మంగళవారం ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా.. రామ్ చరణ్ వెనక కూర్చొని ఉన్నాడు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ పోస్టర్లో ఎన్టీఆర్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను, రామ్ చరణ్ స్థానంలో తన ఫోటోను పెట్టి వార్నర్ మార్ఫింగ్ చేశాడు. ఈ పోస్ట్‌కు క్షణాల్లో వేల సంఖ్యలో లైకులు వచ్చిపడ్డాయి. సన్‌రైజర్స్ అభిమానులైతే కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్ సెకండాఫ్‌లో ఆర్‌ఆర్ఆర్ మూవీలా దుమ్ములేపాలని కామెంట్ చేశారు.
ఈ ఫొటోను చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సహచరుడు రషీద్ ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. 'హెల్మెట్ గాయ్స్' అంటూ ట్రోల్ చేశాడు. కాగా, ఇదే ఫొటోకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా రషీద్ ఖాన్ లానే స్పందించారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫోటోలకు హెల్మెట్లు పెట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఉందని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా ఆర్ఆర్ఆర్ బృందం మరో ట్వీట్ చేస్తూ ఇది పరిపూర్ణంగా లేదని, నెంబరు ప్లేట్ మిస్సయిందని గుర్తు చేశారు. మధ్యలో కల్పించుకున్న అభిమానులు ఆ బైక్‌కు హెడ్ లైట్ కూడా లేదని సరదా కామెంట్లతో హోరెత్తించారు.
ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలమవ్వడంతో అతని కెప్టెన్సీపై వేటు వేసిన టీమ్ మేనేజ్‌మెంట్ కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
ఒకే ఒక విజయంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. సెకండాఫ్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. బలహీనమైన మిడిలార్డర్, పేలవ బౌలింగ్ ఆ జట్టు విజయాలపై ప్రభావం చూపుతుంది.