బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (16:43 IST)

రిటైర్మెంట్ ప్రకటించిన ఇయాన్ మోర్గాన్

Eoin Morgan
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రపంచ కప్‌ను అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. గత కొంతకాలంగా సరైన ఫాంలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటనను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. 
 
ఈ సందర్భంగా ఇయాన్ మోర్గాన్ స్పందిస్తూ, తాను ఇప్పటివరకు సాధించిన విజయాలపట్ల గర్వపడుతున్నానని, తాను ఎంతో మంది గొప్ప క్రికెటర్లతో ఆడిన గత అనుభవాలు తనకు మర్చిపోలేని మధురస్మృతులను మిగిల్చాయని, ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. 35 యేళ్ల మోర్గాన్ ఇయాన్ తన నాయకత్వంలో ఇంగ్లండ్ జట్టును తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దారు. 
 
తన కెరీర్‌లో మొత్తం 248 వన్డే మ్యాచ్‌లు ఆడిన మోర్గాన్.. వన్డేల్లో 7,701 పరుగులు చేయగా, 14 సెంచరీలతో రాణించాడు. అలాగే, 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన మోర్గాన్ 14 అర్థ సెంచరీలతో 2,458 పరుగులు చేసాడు. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్ రీఎంట్రీ ఇచ్చాడు. 
 
2010 నుంచి 2012 వరకు 16 టెస్టులు ఆడిన మోర్గాన్ రెండు సెంచరీలు చేశారు. ఇదిలావుంటే ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న జోస్ బట్లర్ తదుపరి కెప్టెన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది.