అత్యంత వేగవంతమై సెంచరీగా నమోదు.. ఎవరు .. ఎక్కడ చేశారు?
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో అనేక రికార్డులు బద్ధలవుతుంటే, సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఒకటి నమోదైంది. బుధవారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఆటగాడు మ్యాక్స్‌వెల్ వీరవిహారం చేశాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. తద్వారా అత్యంత వేగవంతమైన శతకం చేసిన క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.
ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ డచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 8 సిక్సర్లు, 9 ఫోర్లసాయంతో వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. గతంలో మార్కరమ్ 49 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెల్సిందే.
ఇదిలావుంటే, ఇప్పటివరకు వరకు అత్యధిక వేగవంతమైన సెంచరీలు చేసిన ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే, 40 బంతుల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నెదర్లాండ్స్ జట్టుపై సెంచరీ చేశాడు. 2023లో శ్రీలంక జట్టుపై ఎయిడెన్ మార్కరమ్ 49 బంతుల్లో సెంచరీ చేయగా, 2011లో 50 బంతుల్లో కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్‌పై సెంచరీ చేశాడు. అలాగే, 2015లో 51 బంతుల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ శ్రీలంకపై శతకం బాదాడు. 2015లో ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్ జట్టుపై 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమి...
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో మిగిలిన పోటీలు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఇందులో డచ్ జట్టు అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. ప్రపంచ కప్ చరిత్రలోనే ఘోర పరాజయం ఇదే కావడం గమనార్హం. ఆ జట్టు ఏకంగా 309 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, వార్నర్‌లు చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ ఓటమి ఖరారైంది. అలాగే, మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్న్ 104, మ్యాక్స్‌వెల్ 106, స్టీవ్ స్మిత్ 72, మార్నస్ 62 చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత 400 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 90 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ జట్టు ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ మాత్రమే అత్యధికంగా 25 పరుగులు చేశాడు. ఫలితంగా ఆ జట్టు స్కోరు వంద కూడా దాటకుండానే అన్ని వికెట్లను కోల్పోయింది. జట్టులో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. దీంతో కంగారు బౌలర్లు వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ న్యూఢిల్లీ వేదికగా జరిగింది.