బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

జస్ప్రీత్ బుమ్రాకు హర్యానా హరికేన్ సలహా!

ప‌్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్‌లోని బెస్ట్ పేస్ బౌల‌ర్ల‌లో టీమిండియా పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా ఒక‌డు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. షార్ట్ ర‌న‌ప్‌తో అత‌డు జ‌న‌రేట్ చేసే పేస్‌ను ఎదుర్కోవ‌డానికి బ్యాట్స్‌మ‌న్ కిందా మీదా ప‌డ‌తారు. అయితే దీంతోనే బుమ్రా కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ హెచ్చరిస్తున్నాడు. 
 
అంత త‌క్కువ ర‌న‌ప్‌తో ఆ స్థాయి పేస్ జ‌న‌రేట్ చేయ‌డానికి చాలా సామ‌ర్థ్యం అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని, అది బుమ్రా శ‌రీరంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని అభిప్రాయపడ్డారు. విండీస్ మాజీ దిగ్గ‌జం మైకేల్ హోల్డింగ్ కూడా గ‌తంలో ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. 
 
తాను కూడా అత‌నితో ఏకీభ‌విస్తున్న‌ట్లు క‌పిల్ చెప్పాడు. ఇలాంటి ర‌న‌ప్‌తో ఎక్కువ కాలం బుమ్రా కొన‌సాగ‌డం అంత సులువు కాద‌ని అన్నాడు. నాలుగు లేదా ఎనిమిది ఓవ‌ర్ల వ‌ర‌కూ ఓకే కానీ.. రోజూ 20 నుంచి 25 ఓవ‌ర్లు వేస్తూ 3, 4, 5 టెస్టులు వ‌రుస‌గా ఆడుతుంటే బుమ్రా శ‌రీరంపై తీవ్ర ఒత్తిడి ప‌డుతుందని క‌పిల్ చెప్పుకొచ్చారు. 
 
హోల్డింగ్ చెప్పింది నిజ‌మేన‌ని, బుమ్రా త‌న శ‌రీరంపై ఒత్తిడి బాగా పెంచుతున్నాడ‌ని అన్నాడు. అయితే అత‌ను ఈ స‌వాలును దీటుగా ఎదుర్కొంటాడ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశాడు. త‌న షార్ట్ ర‌న‌ప్‌తో బుమ్రాలాగా బ్యాట్స్‌మెన్‌ను వ‌ణికించే సామర్థ్యం మ‌రే ఇత‌ర బౌల‌ర్‌కు లేద‌ని క‌పిల్ స్ప‌ష్టం చేశాడు. ఒక‌ప్పుడు టీమిండియా పేస్ బౌలింగ్ భారాన్ని ఒంటిచేత్తో మోసిన క‌పిల్‌.. ప్ర‌స్తుత టీమ్‌లోని పేస‌ర్ల‌ను చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నాడు.