శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఎమర్జింగ్ ఆసియా క్రికెట్ కప్ : నేడు భారత్ - పాకిస్థాన్ యువ జట్ల పోరు

teamindia young
ఎమర్జింగ్ ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ యువ జట్ల మధ్య పోరు జరుగనుంది. లీగ్‌ స్టేజ్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్ కప్‌ ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. ఈ మినీ టోర్నీలో భారత్‌ ఓటమి అనేదే లేకుండా ఫైనల్‌కు చేరింది. 
 
సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై ఒక దశలో ఓడిపోతుందేమోనని భావించినా.. బౌలర్లు సమష్టిగా రాణించి భారత్‌ను గెలిపించారు. ఇక లీగ్‌స్టేజ్‌లో అయితే ఎదురే లేకుండా పోయింది. గ్రూప్‌ స్థాయిలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత యువ క్రికెటర్లు అదరగొట్టారు. ఫైనల్‌లోనూ ఇదే ఉత్సాహంతో ఆడి కప్‌ను గెలుచుకురావాలనేది అభిమానుల ఆకాంక్ష. 
 
భారత యువ జట్టు సారథి యశ్‌ ధుల్‌తోపాటు ఓపెనర్‌ సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. లీగ్‌ స్టేజ్‌లో పాక్‌పైనే సాయి సెంచరీ సాధించాడు. ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై యశ్‌ ధుల్‌ శతకం చేయడం విశేషం. అభిషేక్ శర్మ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలిచాడు. మరోసారి ఫైనల్‌లోనూ ఇదే ప్రదర్శన చేస్తే భారత్ గెలవడం పెద్ద కష్టమేం కాదు. 
 
ఎమర్జింగ్ ఆసియా కప్‌ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాపర్‌ భారత్ ఆటగాడే కావడం విశేషం. సెమీస్‌లో  బంగ్లాదేశ్‌ను కుదేలు చేయడంలో కీలక పాత్ర పోషించిన నిశాంత్ సింధు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. 
 
మానవ్‌ సంధు 9 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక లీగ్‌ స్టేజ్‌లో పాక్‌పై రాజ్‌వర్థన్‌ హంగార్గేకర్ (5/42) కూడా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచుల్లోనే 8 వికెట్లు తీశాడు. వీరే కాకుండా హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి, రియాన్‌ పరాగ్‌ మద్దతుగా నిలవాలి. 
 
లీగ్‌ స్టేజ్‌లో భారత్‌ చేతిలో చిత్తు అయినప్పటికీ.. సెమీస్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. అయితే, కెప్టెన్‌ మహ్మద్‌ హారిస్‌, ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ వసీమ్‌, ఓపెనర్‌ ఫర్హాన్‌, పేసర్లు మహమ్మద్‌ వాసిమ్‌ జూనియర్‌, అర్షద్‌ ఇక్బాల్‌లతోలా జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. పాక్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అదరగొట్టిన అమద్‌ బట్‌, ఒమర్‌ యూసుఫ్‌లతో భారత్  జాగ్రత్తగా ఉండాల్సిందే. శ్రీలంకలోని కొలొంబో వేదికగా మ్యాచ్‌ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 
 
జట్లు (అంచనా): 
 
భారత్‌: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యశ్‌ ధుల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), మానవ్‌ సుతార్, హర్షిత్ రాణా, యువరాజ్‌సింగ్‌ దోడియా, హంగార్గేకర్
 
పాకిస్థాన్‌: సైమ్ అయుబ్, తయ్యబ్ తాహిర్, మహమ్మద్‌ హారిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఫర్హాన్, ఓమైర్ యూసఫ్, ఖాసిమ్ అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ భట్, మహమ్మద్‌ వాసిమ్‌ జూనియర్, అర్షద్‌ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్