గురువారం, 12 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (12:55 IST)

శ్రీలంక‍‌తో క్రికెట్ సిరీస్.. రెండు ఫార్మెట్లకు జట్టు ప్రకటన

team india
స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో భారత్ క్రికెట్ సిరీస్ ఆడనుంది. ఇందులోభాగంగా, టీ 20, వన్డే సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ప్రకటించనున్నారు. టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయగా, వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించారు. వన్డే జట్టులో డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ చోటును కోల్పోగా, వన్డే జట్టులోకి కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్‌లు అందుబాటులోకి వచ్చారు. అలాగే, బంగ్లాదేశ్ పర్యటనలో పూర్తిగా విఫలమైన రిషబ్ పంత్‌పై కూడా సెలెక్టర్లు వేటు వేశారు. 
 
టెస్ట్ ఓపెనర్‌గా ఉన్న గిల్‌కు ఈ దఫా టీ20 జట్టులో చోటు కల్పించారు. గతంలో జట్టుకు ఎంపికైనప్పటికీ మైదానంలో దిగే అవకాశం లేకపోవడంతో రాహుల్ త్రిపాఠికి మరో ఛాన్స్ ఇచ్చారు. పేసర్లు శివమ్ మావి, ముకేష్ కుమార్‌లు ఈ సిరీస్‌తో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో తొలిసారి బరిలోకి దిగనున్నారు. 
 
ఇకపోతే, పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ ఇటు వన్డే, అటు టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్‌కు వన్డే జట్టులో చోటు లభించింది. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్‌ ఇప్పటికే టీ20 దూరం కాగా వన్డేల్లో కూడా చోటును కోల్పోయాడు. 
 
అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్‌లు మాత్రం వన్డేలకు అందుబాటులో ఉండనున్నారు. రోహిత్ తిరిగి రావడంతో జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించి హార్దిక్ పాండ్యాను జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ వన్డే సిరీస్‌కు ఏకైక స్పెషలిస్టు వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
 
టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజుశాంసన్, సుందర్, చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, హర్షల్, ఉమ్రాన్, శివమ్ మావి, ముకేశ్ కుమార్
 
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్.