సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (17:39 IST)

అరుదైన ఘనతను సాధించిన రవీంద్ర జడేజా... ఎలైట్ క్లబ్‌లో చోటు!

భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండ్ క్రికెటర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత క్రికెట్ జట్టు తరపున టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మెట్లలో భారత్ తరపున ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకే దక్కింది. ఇపుడు వారి సరసన రవీంద్ర జడేజా కూడా చేరాడు. 
 
టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో భారత్‌ తరపున 50, అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా జడేజా ఎలైట్‌ క్లబ్‌లో చేరాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరసన జడ్డూ నిలువడం విశేషం. జడేజా ఇప్పటివరకు 50 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ధోనీ, కోహ్లీతో దిగిన ఫొటోలను జడేజా ట్విటర్లో షేర్‌ చేశాడు.
 
అలాగే, తనకు ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచి, సహకరించిన బీసీసీఐ, సహాయక సిబ్బందికి ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో బ్యాట్‌, బంతితో రాణించిన జడేజా టెస్టుల్లో 15వ అర్థశతకం సాధించాడు. 2004లో అరంగేట్రం చేసిన ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మరోవైపు కోహ్లీ 87 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.