17 యేళ్ళ తర్వాత చెన్నైను సొంత గడ్డపై చిత్తు చేసిన బెంగుళూరు
ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. పైగా చెన్నైను వారి సొంత మైదానంలో ఆర్సీబీ జట్టు 17 యేళ్ల తర్వాత ఓడించింది. ఈ మ్యాచ్‌లో 197 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.
చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర 41, రాహుల్ త్రిపాటి 5, దీపక్ హుడా 4, సామ్ కరన్ 8, శివమ్ దూబే 19, కెప్టెన్ రుతురాజ్ 0 చొప్పున పరుగులు చేశారు. బెంగుళూరు బౌలర్లలో జోష్ హేజల్ వుడ్ 3, యశ్ దయాల్ 2, లివింగ్‌స్టోన్ 2 చొప్పున, భువనేశ్వర్ ఒక వికెట్ చొప్పున తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్ 51 అర్థ సెంచరీతో రాణించగా, పిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31 చొప్పున పరుగులు చేసి మంచి సుభారంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్‌లోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫలితంగా ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది.