శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (13:42 IST)

కగిసో రబడా అరుదైన రికార్డ్.. 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా..?

Kagiso Rabada
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా అరుదైన ఘనతను సాధించాడు. అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మూడో రోజు ఆటలో హసన్ అలీని ఔట్ చేయడం ద్వారా రబడా ఈ ఘనతను అందుకున్నాడు.

రబడా 44 మ్యాచ్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోగా.. సఫారీ వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్ 39 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇక పాకిస్థాన్ బౌలర్ యాసిర్ షా 33 టెస్ట్‌ల్లోనే 200 వికెట్ల పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
 
200 వికెట్లకు రబడా 8154 బంతులు వేయగా.. ఈ జాబితాలో మూడో పేసర్‌గా గుర్తింపుపొందాడు. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ 7730 బంతులకే ఈ ఘనతను అందుకోగా.. డేల్ స్టెయిన్ 7848 బంతుల్లో ఈ మైలురైయి అందుకున్నాడు. 
 
ఇక 200 వికెట్లు తీసిన 8వ సౌతాఫ్రికా బౌలర్‌గా కూడా రబడా గుర్తింపు పొందాడు.డేల్ స్టెయిన్(439) హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉండగా.. షాన్ పొలాక్(421), మఖయా ఎన్తినీ(390), అలాన్ డొనాల్డ్(330), మోర్నీ మోర్కెల్(309), జాక్వస్ కల్లీస్(291), వెర్నన్ ఫిలాండర్(224) రబడా కన్నా ముందున్నారు.
 
ఇక తొలి టెస్ట్‌లో ఆతిథ్య పాకిస్థాన్ ఆధిప్యతం కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 378 పరుగులకు ఆలౌటైంది. 308/8 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన పాక్.. మరో 78 పరుగులు జోడించి ఆలౌటైంది. దాంతో ఆతిథ్య జట్టు 158 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 
 
పాక్ జట్టులో ఫవాద్ అలామ్(109) సెంచరీతో రాణించగా.. అజార్ అలీ(51), ఫహీమ్ అష్రఫ్(64) హాఫ్ సెంచరీలతో మెరిసారు. సఫారీ బౌలర్లలో రబడా, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడి రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ లంచ్ బ్రేక్ సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.