గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జులై 2024 (12:00 IST)

ఆత్మహత్య చేసుకోవాలని భావించిన మహ్మద్ షమీ!! ఎందుకో తెలుసా?

shami
భారత క్రికెట్ జట్టులోని మేటి బౌలర్లలో మహ్మద్ షమీ ఒకరు. ఈయన ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దీనికి కారణం లేకపోలేదు. ఒక్కసారిగా అనేక సమస్యలు, వివాదాలు చుట్టుముట్టడంతో వీటి నుంచి విరక్తి చెందేందుకు ఆయన బలవన్మరణానికి పాల్పడాలని భావించారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు ఒకరు తాజాగా వెల్లడించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రస్తుతం జట్టులో ప్రధాన బౌలర‌గా రాణిస్తున్నప్పటికీ... కొన్నేళ్ల క్రితం షమీ వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. షమీతో విడిపోయాక అతడి భార్య గృహ హింస కేసు పెట్టింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపించారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారని అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ పేర్కొన్నాడు. ఒకానొక దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడని చెప్పుకొచ్చాడు.
 
'అప్పట్లో షమీకీ అన్ని ప్రతికూలంగా మారాయి. పరిస్థితులకు ఎదురీదాడు. నాతోనే ఉండేవాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తడం ఆ తర్వాత దర్యాప్తు కూడా ప్రారంభంకావడంతో అతడు కుమిలిపోయాడు. ఏదైనా భరించగలను కానీ దేశద్రోహం చేశానన్న నిందను మాత్రం భరించలేనని చెప్పాడు. అతడు ఏదో తీవ్ర నిర్ణయం తీసుకోబోయాడన్న వార్తలు కూడా వచ్చాయి. 
 
ఆ రోజు నేను తెల్లవారుజామున 4 గంటలకు మంచినీళ్లు తాగేందుకు గదిలోంచి బయటకు రాగా షమీ బాల్కనీ వద్ద నిలబడి కనిపించాడు. మా ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. ఏం జరుగుతోందో నాకు అప్పుడు అర్థమైంది. షమీ జీవితంలో ఆ రాత్రి చాలా సుదీర్ఘమైంది. ఆ తర్వాత ఓ రోజు మేము ఏదో విషయంపై మాట్లాడుతుండగా తనకు ఓ మెసేజ్ వచ్చింది. దర్యాప్తులో అతడికి క్లీన్ చిట్ వచ్చిందని దాని సారాంశం. ఆ రోజు అతడు వరల్డ్ కప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషపడి ఉంటాడు' అని చెప్పుకొచ్చాడు.
 
తన కష్టాల గురించి షమీ కూడా ఓసారి మీడియాతో పంచుకున్నాడు. జీవితంలో ముందుకెళ్లాలంటే తమ ప్రాధాన్యాలు ఎమిటో ఎవరికి వారు నిర్ణయించుకోవాలని చెప్పాడు. అవతలి వారి ఆరోపణలు అవాస్తవాలని తెలిసినప్పుడు పట్టించుకోకుండా ముందుకు సాగాలన్నాడు. ఈ రోజు తానీ స్థితికి వచ్చి ఉండకపోతే తన ఒడిదుడుకుల గురించి మీడియా సహా ఎవరికీ ఆసక్తి ఉండేది కాదని చెప్పుకొచ్చాడు. జీవితంలో పోరాడుతూనే ఉండాలని చెప్పుకొచ్చాడు.