శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (17:25 IST)

మరో మైలురాయికి చేరువలో ధోనీ... తొలి వికెట్ కీపర్‌గా...

మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో మైలురాయి చేరనుంది. అయితే, ఈ రికార్డును చేరుకోవాలంటే ధోనీ మరో 33 పరుగులు చేయాల్సివుంది. అలా చేసిన పక్షంలో అన్ని ఫార్మెట్‌లలో కలిపి 17 వేల పరుగులు చేసిన భారతీయ క్రికెటర్ల జాబితాలో ధోనీ చేరుతాడు. ఇప్పటివరకు ఆ ఖాతాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఉన్నారు. మరెవ్వరూ ఈ అరుదైన ఫీట్‌ను అందుకోలేక పోయారు. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ జట్టుతో భారత్ ఐదు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. అయితే, ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టును ధోనీ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 59 (నాటౌట్) పరుగులే చేసినప్పటికీ... కేదార్ జాదవ్ (81 నాటౌట్)తో కలిసి అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ నేపథ్యంలో అన్ని ఫార్మెట్లలో కలిపి 17 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు ధోనీ 33 పరుగులు చేస్తే సరిపోతుంది. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు చేయగా, ద్రావిడ్ 24,208 రన్స్, కోహ్లీ 19,453 (నాటౌట్), సౌరవ్ గంగూలీ 18,575, సెహ్వాగ్ 17,253 చొప్పున పరుగులు చేశారు. 
 
వీరి సరసన చేరేందుకు 33 పరుగుల దూరంలో ఉన్న ధోనీ... ఇప్పటివరకు టెస్టుల్లో 4,876 పరుగులు, వన్డేల్లో 10,474 పరుగులు, ట్వంటీ20ల్లో 1,617 చొప్పున మొత్తం 16967 పరుగులు చేశారు. అంటే 17 వేల రికార్డును చేరుకునేందుకు మరో 33 పరుగుల దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు కలిగిన ధోనీ.. మరో మూడు వన్డే మ్యాచ్‌లు ఉన్నందుకు ఈ రికార్డును కూడా ఆస్ట్రేలియా పర్యటనలోనే పూర్తి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.