సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (16:37 IST)

ఐపీఎల్‌లో ధోనీ సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఎందరో క్రికెటర్లను రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేసిన టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్. గత 11 సీజన్లలో ఆడిన క్రికెటర్లు ఎంతోమంది కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు. అలాగే, అనేకమంది యువ క్రికెటర్లు తమ సత్తాచాటి జాతీయ జట్టులో ఎంపికయ్యారు. యువ క్రికెటర్ల పుణ్యమాని ఫామ్‌లో లేని అనేక మంది సీనియర్ క్రికెటర్లు జట్టుకు దూరమయ్యారు. 
 
ఐపీఎల్‌లో గెలుపోటములతో నిమిత్తం లేకుండా బ్యాట్ లేదా బంతితో రాణిస్తే మాత్రం ఆ క్రికెటర్‌పై కనకవర్షం కురిసినట్టే. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోనీనే. గత 11 సీజన్లలో మహీ అర్జించిన మొత్తం ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఇపుడు 12వ సీజన్‌ కోసం సిద్ధమయ్యాడు. ఈ ఒక్క సీజన్ కోసం జార్ఖండ్ డైనమెట్ ఏకంగా రూ.15 కోట్లు పుచ్చుకోనున్నాడు. 
 
ఈ నేపథ్యంలో గత 11 సీజన్లలో భారత మాజీ కెప్టెన్ సంపాదన వివరాలను పరిశీలిస్తే, ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీలలో సూపర్‌ హిట్‌ జట్టేదైనా ఉందంటే అది చెన్నై సూపర్‌ కింగ్సే. దానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీనే. ధనాధన్‌ సిక్సర్లతో, హెలికాప్టర్‌ షాట్లతో అభిమానులను అలరించడమే కాకుండా, ఓడిపోయే మ్యాచ్‌లెన్నింటినో మలుపు తిప్పాడు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్‌ని మూడు సార్లు విజేతగా నిలిపాడు. 
 
ఐపీఎల్‌ ద్వారా ధోనీ ఇప్పటివరకు సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. 12 సీజన్లతో కలిపి రూ.122.84 కోట్లు ఆర్జించాడు. 2008-10 వరకు సీజన్‌కు రూ.6 కోట్లు అందుకున్నాడు. 2011-13 వరకు రూ.8.28 కోట్లు, 2014-17 వరకు రూ.12.5 కోట్లు తీసుకున్నాడు. ఇక 2018 నుంచి రూ.15 కోట్లు పుచ్చుకుంటున్నాడు. ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా మరికొంత మొత్తం అందుకున్నాడు.