శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (22:58 IST)

#WTC21final: అదరగొట్టిన భారత బౌలర్లు.. 72 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు

WTC Final
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ పేసర్లు దుమ్మురేపుతున్నారు. భారత ఆటగాళ్లు మూడో రోజు పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.. ఐదు రోజు ఫస్ట్ సెషన్‌లో అదరగొట్టారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకొని ప్రత్యర్థి‌ క్రికెటర్లకు చుక్కలు చూపించారు. ఫీల్డర్ల సహకారం కూడా అందడంతో ఫస్ట్ సెషన్‌లోనే మూడు వికెట్లు తీశారు.
 
ఓ వైపు కేన్ విలియమ్సన్(112 బంతుల్లో 19) జిడ్డు బ్యాటింగ్‌తో సతాయించినా.. మరో ఎండ్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేర్చారు. దాంతో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 72 ఓవర్లలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. క్రీజులో విలియమ్సన్‌తో పాటు ఆల్‌రౌండర్ కోలిన్ గ్రాండ్ హోమ్(0 బ్యాటింగ్) ఉన్నారు. ఈ సెషన్‌లో షమీ రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్ ఓ వికెట్ పడగొట్టాడు. ఫలితంగా కివీస్ 32పరుగుల ఆధిక్యంలో వుంది. 
 
101/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌పై భారత్ బౌలర్లు ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగారు. బుమ్రా, షమీ, ఇషాంత్ ముగ్గురు ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేశారు. అయితే మరోవైపు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సైతం ధీటుగా ఎదుర్కొన్నారు. పక్కా వ్యూహంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యారు.
 
దాదాపు 13 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విసుగుతెప్పించారు. 13 ఓవర్లలో న్యూజిలాండ్ చేసింది కేవలం 16 పరుగులు మాత్రమే అంటే వారి బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వచ్చిన డ్రింక్స్ బ్రేక్ భారత్‌కు కలిసొచ్చింది.
 
ఈ బ్రేక్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మహమ్మద్ షమీకి బంతినందిస్తూ కొన్ని సూచనలు చేశాడు. అటాకింగ్ ఫీల్డింగ్‌తో పాటు షాట్ ఆడేలా బంతి వేయాలని చెప్పాడు. ఇక కోహ్లీ చెప్పినట్లుగానే బాల్ వేసిన షమీ.. శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌ సాయంతో రాస్ టేలర్(11) వికెట్‌ను తీసి భారత శిభిరంలో ఉత్సాహాన్ని నింపాడు. అతను వేసిన 64 ఓవర్ తొలి బంతిని ఫుల్లర్‌గా వేయగా.. రాస్ టేలర్ కవర్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్‌కు కనెక్ట్ అయినా.. షార్ట్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ సూపర్ డైవ్‌తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
 
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్(7) ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మ సూపర్ క్యాచ్‌కు వెనుదిరగ్గా.. కెరీర్‌లో చివరి టెస్ట్ బరిలోకి దిగిన కివీస్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్‌(1)ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. కొంచెం లేటుగా వికెట్లు పడినా.. న్యూజిలాండ్‌కు చేయాల్సిన నష్టాన్ని భారత బౌలర్లు చేశారు. బుమ్రా మినహా ఇద్దరు బౌలర్లు సూపర్ లైన్ లెంగ్త్‌తో వికెట్లు సాధించారు. దాంతో తొలి సెషన్‌ భారత్ వశమైంది. సెకండ్ సెషన్ చివరిలోపు న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేస్తే మ్యాచ్‌పై భారత్ పట్టుబిగించవచ్చు.