శనివారం, 16 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 10 జూన్ 2017 (05:42 IST)

భారత్‌ ఓటమే లక్ష్యంగా.. మాజీల వ్యూహాలు.. మరి మన మాజీలు ఏం చేస్తున్నట్లు?

ఓటమి అసాధ్యం అనుకున్న చోట శ్రీలంక భారత జట్టును దిమ్మ తిరిగేలా చేసింది. భారత్‌తో పోలిస్తే మరుగుజ్జు అని భావించిన జట్టు టీమిండియాను చిత్తు చిత్తుగా బాది పడేసింది. అపజయం లేదనుకున్న చోట ఘోర పరాజయం ఎదురైంది. టీమిండియా జట్టుకు శృంగభంగం జరిగిన ఘటనకు వెనుక

ఓటమి అసాధ్యం అనుకున్న చోట శ్రీలంక భారత జట్టును దిమ్మ తిరిగేలా చేసింది. భారత్‌తో పోలిస్తే మరుగుజ్జు  అని భావించిన జట్టు టీమిండియాను చిత్తు చిత్తుగా బాది పడేసింది. అపజయం లేదనుకున్న చోట ఘోర పరాజయం ఎదురైంది. టీమిండియా జట్టుకు శృంగభంగం జరిగిన ఘటనకు వెనుక చాలా తతంగమే నడిచింది మరి. కుమార సంగక్కర చివరి రోజు శ్రీలంక జట్టును కలిసి విజయ సాధనకు ఏం చేయాలో చిట్కాలు చెప్పక పోయి ఉంటే శ్రీలంక అంత దూకుడుతనాన్ని ప్రదర్శించి భారత్ బౌలింగ్‌ను చితకబాది ఉండేది కాదని ఇప్పుడు తేలిపోయింది. ఇప్పుడు భారత్‌ను ఓడించడానికి సఫారీ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా తమ వంతు సహాయం అందించటానికి సిద్ధపడిపోయారు.
 
చాంపియన్స్‌ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు రచిస్తున్నారు. గురువారం భారత్‌- శ్రీలంక మ్యచ్‌లో శ్రీలంక గెలుపుకు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర సూచనలే కారణమని కెప్టెన్‌ మాథ్యూస్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు సంగక్కర శ్రీలంక ఆటగాళ్ల శిక్షణ శిభిరంలో పాల్గొని యువ ఆటగాళ్లకు బ్యాటింగ్‌ టిప్స్‌ అందించాడు. భారత్‌తో తలపడాలంటే తొలి నుంచి దూకుడే తారకమంత్రమన్నాడు. ఈ సూచనలు అమలు చేసిన లంకేయులు భారత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశారు. 
 
ఇప్పుడు ఆ దారిలోనే సఫారీలు నడుస్తున్నారు. ఇక ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో భారత్‌ను మట్టికరిపించేందుకు ఆ దేశ మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ సలహాలు తీసుకుంటున్నారు.  శుక్రవారం సఫారీల ప్రాక్టీస్‌ సెషన్‌లో గ్రేమ్‌ స్మిత్‌ పాల్గొన్నాడు. సుమారు 35 నిమిషాలపాటు వారి శిక్షణను గమనించాడు. ఆ జట్టు ప్రధాన కోచ్‌ రస్సెల్‌ డొమింగో, సహాయక సిబ్బందితో భారత్‌ మ్యాచ్‌కు అనుసరించే ప్రణాళికలపై ముచ్చటించాడు. 
 
ఈ విషయంపై దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ కోచ్‌ నీల్‌ మెకంజీతో ప్రస్తావించగా.. గ్రేమ్‌ స్మిత్‌ దక్షిణాఫ్రికా గొప్ప కెప్టెన్‌ అని ఆయన సూచనలు ఆటగాళ్లకు  విలువైనవని బదులిచ్చాడు. భారత్‌ జరిగే మ్యాచ్‌కు ఆటగాళ్లు ఎలా సిద్దం కావాలని స్మిత్‌ తన అభిప్రాయాలను ఆటగాళ్లతో పంచుకున్నాడని నీల్‌ పేర్కొన్నాడు. స్మిత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
 
ఇలా దేశదేశాల వెటరన్లు తమ తమ జట్టు గెలుపుకోసం పడరానిపాట్లు పడుతుంటే మన దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు లండన్‌లో ఏం చేస్తున్నట్లు. ఎక్కడ తిరుగుతున్నట్లు అనే ప్రశ్న మొదలవుతోంది. కోహ్లీ టీమ్‌ను మీచావు మీరు చావండి అని మన దిగ్గజాలు గాలికి వదిలేశారా అని నెటిజన్లు ప్రశ్నలు వదులుతున్నారు.