శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

అక్క అక్రమ సంబంధం... అక్కను - ఆమె ప్రియుడిని చంపేసిన తమ్ముడు.. ఎక్కడ?

murder
కట్టుకున్న భర్తను వదిలేసి.. తన చిన్ననాటి ప్రియుడితో అక్క అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అక్కను, ఆమె ప్రియుడిని చంపేశాడు. అడ్డొచ్చిన కన్నతల్లి చేయి కూడా నరికాడు. ఆ తర్వాత ఊరు వదిలి పారిపోయాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా తిరుమంగళంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వస్తే .. 
 
జిల్లాలోని కోంబాడి గ్రామానికి చెందిన మహాలక్ష్మి(28), సతీష్ కుమార్ (28) మూడేళ్లకు ముందు ప్రేమించుకున్నారు. ఇరువురూ వేర్వేరు కులాలకు చెందినవారు కావటంతో వారి ప్రేమను ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. ఆ తర్వాత మహాలక్ష్మికి మరో యువకుడితో వివాహం జరిపారు. ఇటీవల భర్తతో ఏర్పడిన వివాదాల కారణంగా ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి తన ఒకప్పటి ప్రియుడు సతీష్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
ఈ విషయం మహాలక్ష్మి తమ్ముడు ప్రవీణ్ కుమార్‌కు తెలిసి ఆమెను తీవ్రంగా మందలించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో మహాలక్ష్మి, సతీష్ కుమార్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక రోడ్డుపై నడచి వెళుతున్న సతీష్ కుమార్‌పై ప్రవీణ్ కుమార్ వేటకొడవలితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొడవలితో శరీరమంతా నరకడంతో పాటు, అతడి తలను నరికి, దానిని ఊరిలోని ఓ మందిరం వేదికపై పడేసి తన ఇంటికెళ్లాడు. 
 
ఆ తర్వాత సోదరి మహాలక్ష్మిని కూడా వేటకొడవలితో దారుణంగా నరికి హతమార్చాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన తల్లి చేతిని కూడా నరికేసి పారిపోయాడు. ఈ ఘటనతో అతని తల్లి స్పృహ తప్పి పడిపోయింది. బుధవారం ఉదయాన్నే సతీష్ కుమార్ తల తెగిపడి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సతీష్ కుమార్ తలను, మొండెంను, మహాలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌కు మార్ తల్లిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.