గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (22:58 IST)

గుంటూరులో వైద్య విద్యార్థిని దారుణ హత్య.. సర్జికల్ బ్లేడుతో దాడి..

knife
గుంటూరులో దారుణం జరిగింది. ఓ వైద్య విద్యార్థిని హత్యకుగురైంది. ఆమె మాజీ ప్రియుడే సర్జికల్ బ్లేడుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రేమోన్మాది కూడా దాడి తర్వాత చేయి కోసుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సోమవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడకు చెందిన నిందితుడు జ్ఞానేశ్వర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈ టెక్కీకి గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది ప్రేమగా మారడంతో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంతలో వారి మధ్య మనస్పర్థలు చెలరేగడంతో అతన్ని తపస్వి దూరం పెట్టేసింది. 
 
ఈ క్రమంలో తక్కెళ్లపాడులోని ఓ దంత వైద్య కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేయసాగింది. ఇందుకోసం వారిద్దరినీ తన ఇంటికి పిలిపించింది. దీంతో తపస్వి గతం వారం రోజులుగా స్నేహితురాలి ఇంట్లోనే ఉంటోంది.
 
ఈ క్రమంలో తపస్విపై పగ పెంచుకున్న జ్ఞానేశ్వర్ ఆమెను హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు వారిద్దరి మధ్య మరోమారు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా, ఆ సమయంలో అతడు కోపోద్రిక్తుడై తపస్విపై సర్జికల్ బ్లేడుతో ఒక్కసారిగా దాడి చేశాడు. దీంతో పక్కనే ఉన్న స్నేహితురాలు బిగ్గరా కేకలు వేస్తూ బయటకు వెళ్లింది. 
 
ఇదే అదునుగా భావించిన జ్ఞానేశ్వర్.. తపస్విని ఇంట్లోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఇంతలో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి తపస్విని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరిలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ తపస్వి కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.