శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (21:18 IST)

బాబ్రీ కేసుకు శుభం కార్డు - కమలనాథులకు కలిసొచ్చిందా..!

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 ఏళ్ల తర్వాత నిందితులందరికీ సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కమలనాథులకు కలిసొచ్చింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో రామాలయానికి అనుకూలంగా తీర్పు రావటం ఆ తర్వాత భూమి పూజ జరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం లక్నో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ సంతోషదాయకమే. సమసి పోయిన వివాదం మళ్లీ అందరి మధ్య లోకి రాకుండా, బాబ్రీ మసీదు విధ్వంసం ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది కాదన్న సీబీఐ కోర్టు తీర్పు పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సి.బి.ఐ సాక్ష్యాధారాలను చూపటంలో ఎందుకు విఫలమైంది. మళ్లీ సిబిఐ కోర్టు తీర్పును సవాలు చేసే అవకాశం ఉందా... అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన బాబ్రీ మసీదు కేసులో లక్నో కోర్టు ఏమి చెప్పింది.

అందర్నీ నిర్దోషులుగా ఎందుకు పరిగణించింది.? 
ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు తెరపడింది. మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ ఊరట లభించింది.మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆద్వానీ, మురళీ మనోహర్ జోషి,ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరినీ నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. సరైన ఆధారాలు లేనందున వారందరిపై అభియోగాలు కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తీర్పులో వెల్లడించారు.
 
మరి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు అందరూ ముందుగానే ఊహించారా... బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో ఏదో జరగబోతోందని దేశం సర్వత్ర ఆసక్తిగా ఎదురు చూసినా, ఈ కేసును కొట్టి వేస్తారన్నదే అందరి మదిలో ముందునుంచి ఉన్న సందేహమే. ముఖ్యంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం దానితోపాటు అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడం జరిగిపోయింది.
 
సుప్రీంకోర్టు తీర్పును రెండు మతాలవారు సాదరంగా స్వాగతించారు. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తాన  ప్రధాని నరేంద్ర మోదీ కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అన్నీ సాఫీగా సాగటం తో ఇక అయోధ్య, బాబ్రీ మసీద్ వివాదానికి పూర్తిగా తెర పడినట్లేనని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానికి వచ్చే ప్రాధాన్యత ఏమీ లేదనే చెప్పాలి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక కుట్ర కోణంలో భావించి కోర్టు తీర్పు ఇచ్చి వున్నా, నిందితులు అందరూ శిక్ష అనుభవించాల్సి వచ్చేది కానీ, ప్రాధాన్యత మాత్రం ఉండేది కాదు. అయినా సిబీిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
 
రాష్ట్ర అద్వానీ రాష్ట్రపతి కాకుండా ఇప్పటికే పరోక్షంగా శిక్ష అనుభవించారా..! 
28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తీర్పు అందరికీ తీపి కబురు అందించింది. ముందస్తుగా నిర్ణయించిన కుట్ర ప్రకారం బాబ్రీ విధ్వంసం జరగలేదని ఆ ప్రదేశంలో రామాలయం నిర్మించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే వారి ముఖ్య ఉద్దేశమని కోర్టు అభిప్రాయపడింది. ఆనాడు ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంది. పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండి చూస్తూ ఉండిపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు.
 
బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కేసు.. 
విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2020 సెప్టెంబర్‌ 30న కీలక తీర్పు వెలువరించింది. ఇక ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 30నాటికి పూర్తి చేసి, తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించించడంతో ప్రత్యేక న్యాయస్థానం గడువు లోపే తుది తీర్పును సిద్ధం చేసుకొని న్యాయమూర్తి చదివి వినిపించారు. సిబిఐ కోర్టు తీర్పును బీజేపీ సీనియర్ నేత ఈ కేసులో నిందితుల ఒకరైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులు స్వాగతించారు. తామెలాంటి కుట్రపూరితంగా బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడలేదని, తమ ఉద్దేశ్యం, అసలు లక్ష్యం ప్రజలకు తెలవటం సంతోషదాయకంగా ఉందన్నారు.
 
లక్నో సిబిఐ కోర్టు తీర్పును ఎంఐఎం అధినేత అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటివారు తప్పుపట్టినా అందులో పోయేదేమీ లేదు. ఈ కేసులో అందాలు నిర్దోషులు అయితే అసలు మసీదును పడగొట్టింది ఎవరు అన్నది ఓవైసీ ప్రశ్న. మసీదు దానంతటదే కూలి పోయిందా అంటూ ప్రశ్నలూ గుప్పించారాయన... అసలు ఇంతకాలం ఈ కేసులో విచారణ ఎందుకు సాగింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు, అక్కడ ఉన్న బిజెపి, విహెచ్‌పీ నేతలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారా.. లేదా అన్నదే ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాలి. ఉద్వేగ ప్రసంగాలతో వారు ఎవరిని రెచ్చగొట్టాలని చూడలేదని, లక్షల సంఖ్యలో ఉన్న కరసేవకులను అదుపు చేయలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. అటు సిబిఐ కూడా కోర్టుకు సమర్పించిన విచారణ పత్రాలలో ఎక్కడా ఆధారాలు చూపలేకపోవడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.
 
ఏదేమైనా ప్రస్తుతం సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి మరింత ఊతంగా మారింది. ఇంతకాలం బీజేపీ నేతలు ఒక కుట్ర ప్రకారమే బాబ్రీ మసీదు కూలగొట్టారన్న అపవాదు వుంది. ప్రస్తుతం సీబీఐ కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో బిజెపి పై వున్న ఆ మచ్చ కూడా తొలగిపోయిందనే చెప్పాలి. అద్వానీతో పాటు ఎనిమిది మంది దాకా బిజెపి సీనియర్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వారందర్నీ ఇన్ని సంవత్సరాలుగా ఈ బాబ్రీ మసీదు కేసు వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం కేసులో తుది తీర్పు రావటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
ఒక దశలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బిజెపి కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి పదవిని అలంకరిస్తారని అందరూ భావించారు. అయితే అనుకోని రీతిలో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎంపిక అయ్యారు. ఆ సమయంలో అద్వానీని రాష్ట్రపతిగా చేయకపోవడానికీ ఆయన పేరు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధానంగా ఉండటం కూడా ఒక బలమైన కారణం. ఏదేమైనా ఎన్ని సంవత్సరాలకు అటు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూల వాతావరణంతో పాటు బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బిజెపి, విహెచ్‌పీ, ఆరెస్సెస్ మిగిలిన హిందూ సంఘాల నేతలందరూ నిర్దోషులుగా బయటపడటం శుభ పరిణామమే. 

రచన.. వెలది కృష్ణకుమార్,
సీినియర్ జర్నలిస్టు,
హైదరాబాద్.