శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:13 IST)

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కీలకాంశాలు ఇవే...

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారందరూ నిర్దోషులేనని జడ్జి సురేష్ కుమార్ యాదవ్ సంచలన తీర్పును వెలువరించారు. 
 
అయితే, ఈ కేసు విచారణ 28 ఏళ్ల పాటు సుధీర్ఘంగా సాగింది. కోర్టు తీర్పుతో బీజేపీ కీలక నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో మొత్తం 32 మంది నిర్దోషులుగా తేలారు. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ కేసు తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా కోర్టు ప్రధానంగా ఐదు కీలక విషయాలను ప్రస్తావించింది. 
 
* బాబ్రీ మసీదు కూల్చివేత ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు.
* నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవు.
* సీబీఐ అందించిన వీడియో, ఆడియోల ప్రామాణికత్వాన్ని విశ్వసించలేము.
* మసీదును కూల్చేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించగా... నిందితులుగా పేర్కొన్న నాయకులు వారిని ఆపేందుకు యత్నించారు.
* నేతల ప్రసంగాల ఆడియో స్పష్టంగా లేదు. 
 
కాగా, 1992, డిసెంబ‌ర్ 6వ తేదీన అయోధ్య‌లోని బాబ్రీ మ‌సీదును ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ల‌క్నో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే బాబ్రీని కూల్చిన‌వాళ్లు సంఘ‌వ్య‌తిరేకులు అని ఇవాళ కోర్టు త‌న తీర్పులో పేర్కొనడం గమనార్హం. 
 
ముఖ్యంగా, మ‌సీదు కూల్చివేత స‌మ‌యంలో అక్క‌డ ఉన్న నేత‌లంతా..  ఆగ్ర‌హంతో ఉన్న జ‌నాల్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని న్యాయ‌మూర్తి ఎస్‌కే యాద‌వ్ తెలిపారు. భారీ జ‌న‌స‌మూహాన్ని రెచ్చ‌గొట్టే విధంగా ఎవ‌రూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని తీర్పులో పేర్కొన్నారు. 
 
వివాదాస్పద ప్రాంతానికి వెనుక భాగం నుంచి రాళ్లు రువ్వ‌డం జ‌రిగింద‌న్నారు. మ‌సీదు స‌మీపంలో హిందూ దేవ‌తామూర్తుల విగ్ర‌హాల ఉన్నాయ‌ని, అందుకే ఆ ప్రాంతాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు అశోక్ సింఘాల్ ప్ర‌య‌త్నించిన‌ట్లు జ‌డ్జి యాద‌వ్ తెలిపారు. 
 
అయితే, 16వ శతాబ్దం నాటి మసీదును కూల్చేలా కరసేవకులను ఉసిగొల్పేందుకు వీరు కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది. కానీ, రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందని, మేము నేరం చేశామనడానికి ఎలాంటి ఆధారం లేదని విచారణలో భాగంగా నిందితులు వాదించారు. అందరి వాదనలు ఆలకించిన తర్వాత 2 వేల పేజీల సుధీర్ఘ తీర్పును చదివి వినిపించారు.