సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సిహెచ్
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (21:12 IST)

సగ్గుబియ్య పునుగులు... ఎలా చేయాలంటే?

సగ్గుబియ్యంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేయడంతో పాటు, బ్లడ్ కొలస్ట్రాల్‌ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండడం వల్లరక్తప్రసరణ సజావుగా సాగి... గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావలసిన మోతాదులో ఉంటాయి. మరి... ఇన్ని ఆరోగ్యప్రయోజనాలున్న సగ్గుబియ్యంతో పునుగులు వేసుకుంటే ఆ రుచే వేరు. సగ్గుబియ్యం పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్దములు:
సగ్గుబియ్యం - రెండు కప్పులు,
బియ్యం-  ఒక కప్పు,
మినపప్పు- అర కప్పు,
ఉల్లిపాయలు-  రెండు,
పచ్చిమిర్చి- మూడు, సన్నగా కట్ చేసుకున్నవి,
అల్లం -చిన్న ముక్క
ఉప్పు- తగినంత,
జీలకర్ర- కొద్దిగా,
నూనె- నాలుగు టీ స్పూన్స్,
 
తయారుచేయు విధానం :
ముందుగా సగ్గుబియ్యం, బియ్యం, మినపప్పు ఆరు గంటలు ముందు నానబెట్టాలి. తరువాత మిక్సి వేసి మెత్తగా దోశ పిండిలా చేసుకోవాలి. ఇలా చేసిన ఈ పిండిని ఆరు గంటలు పక్కన పెట్టాలి. ఇలా పెడితే ఇది పులిసి పునుగులు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన గుంట పొంగడాలు వేసుకొనే పాన్ పెట్టుకొని ఈ గుంటల్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లి, మిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ముక్కలుగా చేసుకోవాలి.

ఇలా కట్ చేసిన ముక్కలు, జీలకర్ర, ఉప్పు రెడీ చేసిన పిండిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం రెడి చేసుకున్న పిండిని చిన్నచిన్న పునుగుల్లా వేసుకోవాలి. వీటి ఒక వైపు వేగాక రెండోవైపు తిప్పి వీటిపై మళ్లీ ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. రెండు వైపులా వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకొని మీకిష్టమైన సగ్గుబియ్యం గుంట పొంగడాలు చట్నితో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.