గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 12 నవంబరు 2022 (19:12 IST)

అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ హైవే మార్గం

outer ring road
‘‘నా కష్టార్జితం కూడపెట్టి హైదరాబాద్‌లో ఓ మంచి ప్రాంతంలో ఓ ప్రోపర్టీ కొనాలనుకుంటున్నాను. కానీ  ఎక్కడ కొనాలో అర్థం కావడం లేదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో కొందామంటే, అందుబాటులో రేట్లు లేవు. ఓ 2-3 ఏళ్లలో మనం పెట్టిన సొమ్ముకు తగిన రాబడి అందించే విధంగా ప్రోపర్టీ కొనాలనేది కోరిక. ఇదే రకమైన భావనలో మీరూ ఉంటే, హైదరాబాద్‌ను విజయవాడతో కలుపుతున్న జాతీయ రహదారి 65 చుట్టుపక్కల ప్రాంతాల వైపు ఓసారి చూడడం ఉత్తమం అని చెప్పాలి.


రాబోయే కాలానికి కాబోయే గచ్చిబౌలి అవుతుందని రియల్టర్ల నమ్మకం. ఈ కారిడార్‌ స్ధిరంగా అభివృద్ధి చెందడమే కాదు, తూర్పు హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికీ ప్రతీకగా నిలుస్తుంది. ఎల్‌బీనగర్‌తో మొదలుపెడితే హయత్‌ నగర్‌, చౌటుప్పల్‌, సూర్యాపేట వంటి ప్రాంతాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతుండటంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధానినీ తెలంగాణా రాజధానితో కలుపుతున్నాయి.
 
లుక్‌ ఈస్ట్‌ అని ఇటీవల తెలంగాణా నగరాభివృద్ధి శాఖామాత్యులు కెటీ రామారావు చెబుతూ నగరం నలుదిక్కులా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని, దీని కోసమై గ్రిడ్‌ లాంటి పాలసీలను తీసుకువస్తున్నామన్నారు. దీనికి తోడు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం విజయవాడ హైవేను త్వరలోనే ఆరు లైన్‌ రోడ్‌గా విస్తరించనున్నామని త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని వెల్లడించింది. ఆరు లైన్ల రోడ్లకు దగ్గరలో ప్రోపర్టీ అంటే ఆస్తి విలువ కూడా గణనీయంగా కూడా పెరుగుతున్నట్లుగానే భావించాలి.
 
పశ్చిమ హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటుగా తూర్పు హైదరాబాద్‌లో అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని తెలంగాణా ప్రభుత్వం పలు పథకాలను అమలుచేస్తోంది. దండుమల్కాపూర్‌ (ఎన్‌హెచ్‌ 65 సమీపంలోని గ్రామం) వద్ద ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఇప్పుడు అభివృద్ధి చేస్తుండటం దీనిలో ఒకటి. ఇప్పటికే పలు కంపెనీలు తమ సంస్ధల ఏర్పాటులో బిజీగా ఉన్నాయి. అలాగే ఈ డిసెంబర్‌ నాటికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని సైతం ఈ ప్రాంతంలో ప్రారంభించనున్నట్లు ఐటీ, నగరాభివృద్ధి శాఖామాత్యులు కె టీ రామారావు చెబుతున్నారు. అలాగే తెలంగాణా ప్రభుత్వ గ్రోత్‌ ఇన్‌ డిస్పెర్శన్‌ (గ్రిడ్‌ ) పాలసీ త్వరలోనే ప్రారంభంకానుంది. దీనితో 35వేలకు పైగా నూతన ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి.
 
అంతేకాకుండా భారీ బహుళజాతి కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎల్‌బీనగర్‌-హయత్‌ నగర్‌ మార్గం ఇప్పుడు పశ్చిమ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ-కోకాపేట కారిడార్‌లా మారనుంది. మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ సరఫరా లేదా తాగునీరు పరంగా మెరుగైన వసతులు ఉండటం చేత అత్యుత్తమ ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్‌ తదితర సంస్థలు కార్యకలాపాలు చాటనున్నాయి. ఈ కారిడార్‌లోనే ఆసియాలో అతిపెద్ద ఫిల్మ్‌ స్టూడియో రామోజీఫిలింసిటీ ఉండటం మరింత విలువను అందిస్తుంది. 
 
హయత్‌ నగర్‌ వాసి శ్రీనివాస్‌ మాతో మాట్లాడుతూ, ‘‘గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నాను. నాతో పాటుగా మరికొంత మంది ఈ ఏరియా వాసులు హైదరాబాద్‌-విజయవాడ హైవే చుట్టుపక్కల పెట్టుబడి పెట్టారు. మేము పెట్టుబడులు పెట్టినప్పటి నుంచి ఆస్తులు ధరలు బాగా పెరిగాయి. ఎవరికైనా భూమి కొనాలనే ఆసక్తి ఉంటే ఈ కారిడార్‌లో పెట్టుబడులు ఉత్తమం’’ అని అన్నారు
 
అందుబాటు ధరలు, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వల్ల ఎన్నో కంపెనీలు తమ విస్తరణ కోసం ఈ కారిడార్‌ వైపు చూస్తున్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి, కాలుష్య రహిత వాతావరణం, తూర్పు హైదరాబాద్‌కు అదనపు ఆకర్షణ. ఈ కారణాల చేతనే భారీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు సైతం ఇటువైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ దశాబ్దాంతానికి హైదరాబాద్‌-విజయవాడ కారిడార్‌ మరీ ముఖ్యంగా ఆర్‌ఎఫ్‌సీ నుంచి 30 కిలోమీటర్ల రేంజ్‌లోని ప్రాంతాలు ఇప్పటి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ సర్క్యూట్‌లా మారనున్నాయని రియల్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌-విజయవాడ కారిడార్‌‌లో పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్‌లో మంచి రాబడులు పొందగలరని చెబుతుండటం గమనార్హం.