మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (20:21 IST)

వేసవి కాలంలో మామిడిపండ్లు తింటే సెగ్గడ్డలు వస్తాయా?

వేసవి కాలం రాగానే మామిడి పళ్లు వచ్చేస్తాయి. ఈ మామిడి పళ్లు తింటే కొందరికి సెగ్గెడ్డలు వస్తాయనే నమ్మకం వుంది. ఐతే సెగ్గడ్డలు రావడానికి, మామిడి పళ్లు తినడానికి ఎలాంటి సంబంధం లేదు. దుమ్ము వున్న ప్రదేశాల్లో వుండటం, గాలి సోకని ఇళ్లలో వుండటం మూలంగా సెగ్గెడ్డలు వస్తుంటాయి.
 
ఎండవేడికి చర్మం కమిలిపోయి, చర్మం మీద చమటతో పాటు దుమ్ము కూడా పేరుకుపోయి, దుమ్ములో వుండే సూక్ష్మక్రిములు వెంట్రుకల కుదుళ్లలోకి చేరి అక్కడి టిష్యూలను చెడగొడతాయి. ఫలితంగా అక్కడ చీము గడ్డలు తయారవుతాయి. మధుమేహం వున్నవారికి వేసవిలో ఎక్కువగా సెగ్గెడ్డలు వస్తుంటాయి. అందువల్ల సెగ్గడ్డలు ఎక్కువగా వస్తుంటే అది మధుమేహం అయి వుంటుందేమోనని చెక్ చేయించుకోవాలి. మధుమేహం వున్నవారు మామిడిపళ్లు తింటే షుగర్ సమస్య మరింత పెరిగి సెగ్గడ్డలు వస్తాయి.
 
వేసవిలో చల్లగా వుండే ప్రదేశంలో వుండటం, రోజుకి నాలుగైదు సార్లు చన్నీళ్ల స్నానం చేయడం, మురికిపోయేలా సబ్బుతో స్నానం చేయడం, స్నానం చేసిన తర్వాత ఒళ్లంతా మంచి పౌడర్ పూసుకోవడం చేస్తుండాలి. కొందరికి వేసవిలో చర్మంపై మచ్చలు వస్తుంటాయి. ఇవి వేసవి సూర్యరశ్మి కారణంగా వస్తుంటాయి. ఇవి దురద, మంట కలిగిస్తుంటాయి. అలాంటివారు తీవ్రమైన ఎండలో తిరగకుండా వుండటం మంచిది. అలాగే శారీరక శుభ్రత కూడా పాటించాలి. ఇలా చేస్తే వేసవిలో సెగ్గడ్డలు రాకుండా వుంటాయి.