శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (09:29 IST)

పుదీనా ఆవిరితో జలుబు మాయం

పుదీనా గురించి మనందరికీ తెలుసు. ప్రకృతి అందించిన ఆరోగ్య వరాలు.. ఆకు కూరలు.. ఇవి కల్గించే ప్రయోజనం అంతా ఇంతా కాదు. ఆకుకూరలు శరీరానికి కావల్సిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. మనిషి జీవనశైలినే మార్చే సత్తా ఆకుకూరలకు ఉంది. అందులో పుదీనాది ప్రత్యేకమైన స్థానం.
 
ఈ పుదీనాను కూరల్లో వేసుకున్నా దీనితో విడి వంటకాన్ని తయారు చేసుకున్నా ఆ రుచే వేరు. పుదీనా పచ్చడి, పుదీనా రైస్, పుదీనాతో ఆహారాలపై గార్నిష్ ఇలా ఏదోఒక రూపంలో పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చైనీయులు దీన్ని అందానికి ఔషధంలా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని చిన్న చిన్ని సమస్యలకు ఎలా ఔషధంగా వాడకోవచ్చో నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ ఆకుల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ సి, డి, ఇ-లతోపాటు తక్కువ మొత్తంలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఉంటుంది. ఇవన్నీ మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కడుపు నొప్పి, మంటను తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. భోజనం తర్వాత ఓ కప్పు పుదీనా టీ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య ఎదురుకాదు.
 
పుదీనాలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లూ, నొప్పుల నుంచి మనల్ని కాపాడతాయి. దంత క్షయాన్ని నివారిస్తాయి. దంతాలూ, నాలుకనూ శుభ్రం చేసి నోటి దుర్వాసనను పోగొడతాయి. ప్రతిరోజూ కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల దంత సమస్యలు రాకుండా నిరోధించవచ్చు.
 
జలుబూ, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వేడినీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టి చూడండి. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి. గాలి పీల్చడానికి ఇబ్బంది ఉండదు.
 
పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ రకరకాల అలర్జీలనూ, ఆస్తమానూ తగ్గిస్తాయి. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా నియంత్రిస్తుంది. గర్భిణులకు ఉదయం పూట ఎదురయ్యే బడలికనూ, అసౌకర్యాన్నీ నివారించడంలోనూ పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది.
 
పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బ్రెయిన్ అలర్ట్ నెస్ పెరుగుతుంది, మతిమరుపు తగ్గిస్తుంది. అందువల్ల పుదీనాను ఏదో ఒక రకంగా రోజువారి ఆహారాల్లో చేర్చుకోవడం, లేదా మింట్ రిఫ్రెష్ నెస్ చూయింగ్ గమ్ నమలడం కూడా మంచిదే.