ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు అన్ని దేశాలు రేయింబవుళ్లు శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా, బయోటెక్ కంపెనీలు విస్తృతంగా పరిశోధనలు చేస్తూ కరోనాకు విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమైవున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు కరోనా వైరస్ ఎన్ని లక్షణాలు కలిగివుంటుందనే అంశంపై ఇపుడు సరికొత్త చర్చసాగుతోంది. ప్రస్తుతం వైద్యులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ కరోనా వైరస్ 13 రకాలైన లక్షణాలు కలిగివుంటుందని చెబుతున్నారు.
వాటిలో ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు, పొట్టలో నొప్పి, అయోమయం, ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం, వాసన, రుచి తెలియకపోవడం, ఆకలి మందగించడం... ఈ లక్షణాలు ఉంటే వారిలో వైరస్ త్వరితంగా పెరుగుతోందని అర్థం.
అయితే అందరిలో ఇవన్నీ ఉండకపోవచ్చు. రెండు వేర్వేరు లక్షణాలు కలిసి ఉండవచ్చు. అలాగే ఈ లక్షణాలలో ఛాతీలో బరువు, ఆయాసం, అయోమయానికి లోనవడం, శరీరం నీలంగా మారడం లాంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే, ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
స్వల్ప లక్షణాలు ఉంటే, ఇంటిలో ఏకాంతంగా ఉంటూ, యాంటీవైరల్, యాంటీబయాటిక్ మందులు తీసుకోవాలి. జింక్, విటమిన్ సి, డి సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటితో పాటు లక్షణాలు తీవ్రంకాకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన మందులతో పాటు, యాంటీ హిస్టమిన్ కూడా తీసుకోవడం అవసరం.
కరోనా లక్షణాలు మొదలైన ఐదు లేదా ఆరో రోజు నుంచి వీరిలో ఇన్‌ఫ్లమేషన్, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడం లాంటి రెండు తీవ్ర లక్షణాలు తలెత్తే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పక పల్స్ ఆక్సీమీటరు, థర్మామీటరుతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకుంటూ ఉండాలి.
కరోనా లక్షణాలు కనిపించిన అయిదో రోజు నుంచి, ప్రతి మూడు రోజులకు ఒకసారి శరీరంలో పెరిగే ఇన్‌ఫ్లమేషన్, రక్తపు గడ్డలను కనిపెట్టే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఫలితాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తే పరిస్థితిని అంచనా వేసి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కాగ్యులెంట్ మందులతో ఈ సమస్యలను అదుపుచేసుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.